హడలెత్తించిన పేలుడు
- ఉలిక్కిపడిన పాతబస్తీ
- భారీ శబ్దంతో విస్ఫోటం.. మంటలు
- బెంబేలెత్తిన స్థానికులు
- నాటుబాంబుగా భావిస్తున్న పోలీసులు
యాకుత్‌పురా, న్యూస్‌లైన్: పాతబస్తీలో పేలుడు ఘటన కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి భవానీనగర్ ఠాణా పరిధిలోని సాలెం చౌక్ 1వ నంబర్ గల్లీలో ఓ ఇంటి ముందు విద్యుత్ స్తంభం వద్ద భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. భారీగా మంటలు చెలరేగాయి. ఒక్క క్షణం బెంబేలెత్తిన స్థానికులు.. ఆపై తేరుకుని ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. గల్లీలోని ఓ గోడ పక్కన భారీ శబ్దంతో పేలుడు సంభవించినట్టు గుర్తించారు.
పేలుడు అనంతరం మంటలు చెలరేగడంతో పక్కనే ఉండే ఇంటి గోడలతో పాటు ఓ ఇంటి పరదా, వంటసామగ్రి కాలిపోయాయి. అక్కడికి సమీపంలో ఇంటి ముందు తోపుడు బండిపై నిద్రిస్తున్న మహ్మద్ సల్మాన్ చేతికి స్వల్ప గాయమైంది. పోలీసులు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు ఘటన స్థలానికి చేరుకుని పేలుడు శకలాలను సేకరించాయి. పక్కనే ఉన్న రైల్వేట్రాక్ పరిసర ప్రాంతాల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గన్‌ఫౌడర్, మేకులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలను బట్టి పేలింది నాటుబాంబు అయి ఉండొచ్చనే నిర్ధారణకు వచ్చారు.
గన్‌పౌడర్, మేకుల్ని పరీక్షల నిమిత్తం ఫొరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. సాలెం చౌక్ ప్రాంతంలో నేరారోపణలు ఎదుర్కొంటూ గతంలో జైలుకు వెళ్లి వచ్చిన వారి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. నగర అదనపు కమిషనర్(శాంతిభద్రతలు) అంజనీ కుమార్, అదనపు కమిషనర్ (సిట్ అండ్ క్రైమ్) సందీప్ శాండిల్యా, దక్షిణ మండల డీసీపీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సీబీసీఐడీ ఎస్‌పీ రామ్మోహన్ రావు, నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ లింబారెడ్డి, దక్షిణ మండలం అదనపు డీసీపీ బాబురావు ఘటన స్థలాన్ని సందర్శించారు.
అకస్మాత్తుగా పేలుడు..
పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. అంతలోనే మంటలు చెలరేగాయి. ఎటు నుంచి వచ్చిందో, ఎవరూ వేశారో తెలియదు కానీ విద్యుత్ స్తంభం వద్ద పేలుడు పదార్థం పడి మంటలు చెలరేగడంతో మా ఇంట్లోని కర్టెన్ కాలిపోయింది.
- అబ్దుల్, ప్రత్యక సాక్షి
భయమేసింది..
అర్ధరాత్రి ఇంటి బయట కూర్చుండగా, పేలుడు సంభవించింది. మంటలు వ్యాపించడంతో భయంతో పారిపోయాను. మొదట ఎవరైనా యువకులు టపాసులు పేల్చారేమోనని భావించాను. కానీ, అక్కడ ఎవరూ లేరు.
- షేక్ నబీ, స్థానికుడు