రాయితీపై తాటిచెట్లు ఎక్కే మిషన్లు!
గీత కార్మికుల ప్రమాదాల నివారణకు ప్రభుత్వ ప్రయత్నం
హైదరాబాద్: కాళ్లు, చేతులతోపాటు శరీరమంతా తన అధీనంలో ఉంచుకొని ప్రతిరోజు తాటి చెట్టు ఎక్కేందుకు సాహసం చేసే గీత కార్మికులు తర చూ ప్రమాదాల బారిన పడి మృత్యుఒడిలోకి చేరిన సంఘటనలు కోకొల్లలు. అంగవైకల్యానికి గురవుతున్నవారి సంఖ్యకు కొదవేలేదు. దీనిపై దృష్టి సారించిన రాష్ర్ట ప్రభుత్వం గీత కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా తాటిచెట్లు ఎక్కే మిషన్లను తెప్పించాలని యోచిస్తోంది. ఇప్పటికే కేరళ, తమిళనాడుల్లో కొబ్బరి, పామ్ చెట్లు ఎక్కేందుకు వినియోగిస్తున్న మిషన్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టేలా కసరత్తు చేపడుతోంది.
ఇందులో భాగంగా ఎక్సైజ్‌శాఖ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్... కులవృత్తుల వారికి అవసరమైన పనిముట్లను తయారు చేసే అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్‌తో సంప్రదింపులు జరిపారు. ఫౌండేషన్ నిపుణులతో పైలట్ ప్రాజెక్టు కింద ప్రయోగాలు చేయాలని నిర్ణయించారు. ఈ మిషన్ల వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉండవని గీత కార్మికులకు నమ్మ కం కుదిరితే రాయితీపై వాటిని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మిషన్‌ను తాటిచెట్టుకు అనుసంధానించి సైకిల్ పెడల్స్‌లా ఉండే వాటిపై నిలబడి తొక్కడం ద్వారా చెట్టుపైకి వెళ్లే వీలు లభిస్తుంది. కనీస ధర రూ. 5 వేలతో మొదలై కోరుకునే సౌకర్యాన్ని బట్టి తదనుగుణమైన ధరల్లో మిషన్లు లభిస్తాయి.