శివారు జోరు
- పెరగనున్న డివిజన్లు
- కోర్ ఏరియాలో తగ్గే అవకాశం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని శివారు ప్రాంతాల్లో కొత్త డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. మరోవైపు పాత ఎంసీహెచ్ పరిధిలో .. ముఖ్యంగా పాతబస్తీ లో డివిజన్లు తగ్గే అవకాశాలూ ఉన్నాయి. త్వరలో జీెహ చ్‌ఎంసీ పాలకవర్గం గడువు ముగియనుండటం.. కోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం.. బుధవారం జీవో జారీ కావడంతోత్వరలోపునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది. 2011 జనాభాను బట్టి అన్ని వార్డుల్లో జనాభా సమానంగా ఉండేలా పునర్విభజించాల్సి ఉంది. దీంతో గ్రేటర్‌లో విలీనమైన శివారు ప్రాంతాల్లో ఎక్కువ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి.
అదే సమయంలో కోర్ ఏరి యాలో డివిజన్లు తగ్గే అవకాశాలున్నాయి. ప్రభుత్వం గతంలోవెలువరించిన జీవో మేరకు 50 లక్షల జనాభా వరకు 143 డివిజన్లు, అనంతరం ప్రతి 60 వేల జనాభాకు ఒక డివిజన్ వంతున ఏర్పాటు చేయవచ్చు. ఇలా చేశాక మిగిలిన జనాభా 30 వేలకు మించి ఉంటే అదనంగా మరో డివిజన్‌ను ఏర్పాటు చేయవచ్చు.
30 వేల లోపు ఉంటే ఇరుగుపొరుగు డివిజన్లలో సర్దుబాటు చేయాలి. వీటిని పరిగణనలోకి తీసుకొని 35 వేల జనాభాకు ఒకటి చొప్పున 2011 జనాభా మేరకు 172 డివిజన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా. ఇలా జరిగితే శివారు ప్రాంతాల్లో ఎక్కువ డివిజన్లు రానున్నాయి. అక్కడ కొన్నిచోట్ల 70వేలకు పైగా జనాభా ఉంది. కోర్ ఏరియాలోని కొన్ని డివిజన్లలో 25 వేలకు అటూఇటూగా మాత్రమే ఉంది. ఇలాంటి డివిజన్లలో కొన్ని కనుమరుగయ్యే అవకాశం ఉంది.
ఉత్తర్వులు జారీ..
గ్రేటర్ పునర్విభజనప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు..ఎన్నికల సంఘం సూచన తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని జీహెచ్‌ఎంసీ వెంటనే ఈ ప్రక్రియను చేపట్టాల్సిందిగా సూచించింది.
ఆ పంచాయతీల సంగతేంటి?
జీహెచ్‌ఎంసీలో విలీనమవుతాయనే ఉద్దేశంతో శివార్లలోని కొన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన జరుగుతుండడంతో ఆ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
వెంటనే పూర్తి చేయాలి: ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్
ఇకనైనా ప్రభుత్వం వెంటనే శాస్త్రీయ పద్ధతిలో వార్డుల విభజన చేపట్టాలని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రిజర్వేషన్ ప్రక్రియను పూర్తిచేసి వీలైనంత త్వరగా సమాచారాన్ని ఎన్నికల సంఘానికి పంపించాలన్నారు. కుంటి సాకులతో ఎన్నికలు ఆలస్యం చేస్తే తాము కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. ఎన్నికలు జాప్యమైతే జీహెచ్‌ఎంసీ కమిషనర్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
సమాన ఓటర్లు ఉండాలి: వీహెచ్
అన్ని డివిజన్లలో సమానంగా ఓటర్లు ఉండేలా పునర్విభజన చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు కోరారు. ఈమేరకు గురువారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు లేఖ రాశారు. గతంలో జరిగిన విభజనలో హెచ్చుతగ్గుల వల్ల అసమానతలు చోటుచేసుకునన విషయాన్ని ప్రస్తావించారు.
పక్షపాతం లేకుండా చూడండి: బంగారి ప్రకాశ్
తమ పార్టీ నాయకులు హైకోర్టును ఆశ్రయించడంతో పునర్విభజనపై రెండు నెలల క్రితమే హైకోర్టు ఆదేశించినా, అధికారులు జాప్యం చేశారని జీహెచ్‌ఎంసీలో బీజేపీ పక్ష నాయకుడు బంగారి ప్రకాశ్ అన్నారు. ఇప్పటికైనా జీవో వెలువరించడం ముదావహమంటూ.. వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వార్డుల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు.. రాజకీయ పక్షపాతాలకు తావులేకుండా విభజన పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
వచ్చేవారం నుంచే...
జీహెచ్‌ఎంసీలో వార్డుల విభజన ప్రక్రియను అధికారులు వచ్చేవారం ప్రారంభించనున్నారు. అంతకుముందు ఆయా ప్రభుత్వ విభాగాలు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు, సమావేశాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. పునర్విభజన సవ్యంగా సాగేందుకు వారి సహకారం తీసుకుంటామని, తమ సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు గురువారం తనను కలిసిన మీడియా ప్రతినిధులకు చెప్పారు.
ఇదిలా ఉండగా, ప్రభుత్వం 1996లోజారీ చేసిన జీవో నెంబరు 570 మేరకు పునర్విభజన చేయనున్నారు. అన్ని వార్డుల్లోనూ జనాభా సమానంగా ఉండాలి. హెచ్చు తగ్గులున్నా అవి పది శాతం లోపునే ఉండాలి. సరిహద్దులనూ పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుత, మార్పు చేయబోయే డివిజన్లను మ్యాపుల రూపంలో, ప్రత్యేక రంగుల్లో ప్రచురించాలి. తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలు, వారి సూచనలు, అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవాలి. వీటితోపాటు మరికొన్ని నియమ నిబంధనలు అమలు చేయాల్సి ఉంది.