
సమగ్రాభివృద్ధికేసర్వే
- పథకాల్లో అవినీతిని నివారిస్తాం
- ఎన్నికల మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తాం
- తెలంగాణలో ఓరుగల్లుకు విశిష్ట స్థానం
- జిల్లా అభివృద్ధే ధ్యేయం
- ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య
- ‘కోట’లో కనులపండువగా స్వాతంత్య్ర దినోత్సవం
సాక్షి, హన్మకొండ: సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకే ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. ప్రభుత్వం వద్ద సరైన సమాచారం లేకపోవడం వల్ల సంక్షేమ పథకాలు దుర్వినియోగమవుతున్నాయని.. రేషన్‌కార్డులు, గృహ నిర్మాణం, పెన్షన్ల వంటి పథకాల్లో అవినీతి చోటుచేసుకుంటోందన్నారు. దీన్ని నివారించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
ఆరోజు ప్రజలందరూ ఇళ్లలో ఉండి సరైన సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఖిలావరంగల్‌లో శుక్రవారం నిర్వహించిన 68వ స్వాతంత్య్ర వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి రాజయ్య పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్ర ఉత్సవాలకు హాజరైన ప్రజలు, ప్రముఖులను, అధికారులు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతాపరుద్రుడు, రాణిరుద్రమ వంటి కాకతీయ చక్రవర్తులు పాలించిన నేలపై స్వాతంత్య్ర దినోత్సవం జరపడం.. అందులో తాను జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నందుకు గర్వపడుతున్నానన్నారు.
ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని రాజయ్య పేర్కొన్నారు. మన జిల్లాకు చెందిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని, 12 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండటం.. రాష్ట్ర గీతాన్ని జిల్లాకు చెందిన అంద్శైరచించడం మనకు గర్వకారణమని అన్నారు.
హామీలు అమలు చేస్తాం..
రాష్ట్ర ప్రభుత్వ చేపట్టబోతున్న కార్యక్రమాలు, జిల్లా అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను డిప్యూటీ సీఎం తన ప్రసంగంలో పేర్కొన్నారు. భూమిలేని దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేస్తున్నామని, అందులో భాగంగా నేడు పది నియోజకవర్గాల్లో పది గ్రామపంచాయతీల్లో భూ పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఎన్నికల మెనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయడంలో భాగంగా రాష్ట్ర మంత్రి వర్గం 43 నూతన పథకాలు ప్రకటించిందని గుర్తు చేశారు. ఓరుగల్లుకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉందని, అందువల్లే ఉపముఖ్యమం త్రి, స్పీకర్ వంటి కీలక పదవులు జిల్లాకు లభించాయన్నారు. ఈ పదవులు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా అభివృద్ధే ధ్యేయం
పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, లెదర్‌పార్క్, కాజీపేటలో వ్యాగన్ వర్క్‌షాప్ వంటి కీలక ప్రాజెక్టులు త్వరలో ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. రాబోయే 20 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 183 మురికివాడల్లో రూ.26.45 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా రూ.75 కోట్లతో మోగాటూరిజం సర్క్యుట్, రూ 1.1 కోట్లతో ఎంజీఎం ఆస్పత్రి పునరుద్ధరణ, దానితో పాటు రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. అదేవిధంగా 13వ ఆర్థిక ప్రణాళిక సంఘం ద్వారా రూ.6 కోట్ల వ్యయతో మల్యాల, తాటికొండ, పైడిపల్లి, సిద్ధాపూర్, ఇప్పగూడ, కొండపర్తి, ఓబుల్ కేశవాపూర్, కురవిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించనున్నట్లు చెప్పారు.
వరంగల్‌లో హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. జిల్లాలో ‘మనగ్రామం-మనప్రణాళిక’ కింద రూ.1450 కోట్లు, మన మండలం-మన ప్రణాళిక కింద రూ.2600 కోట్లు, మన జిల్లా -మన ప్రణాళిక కింద రూ.200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. మున్సిపాలిటీల అభివృద్ధికి రూ 32.47 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రక్షిత మంచినీరు అందించేందుకు రూ.204 కోట్లతో 16 ప్రాజెక్టులు చేపట్టగా ఇప్పటికే 2 ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు.
జాతీయ రహదారుల విభాగం ద్వారా రూ.442 కోట్లతో వివిధ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. విద్యుత్ లోటును అధిగమించడంలో భాగంగా భూపాలపల్లిలో మరో 500 మెగావాట్ల విద్యుత్‌ప్లాంట్ నిర్మాణం చేయబోతున్నట్లు చెప్పారు. పదోతరగతి ఫలితాల్లో 94.54 శాతం ఉత్తీర్ణత సాధించి తెలంగాణలో మొదటిస్థానంలో నిలిచిన విద్యాశాఖకు డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం కావాలని పిలుపునిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.