
ఆఫర్..ఆకర్ష్
సాక్షి, ఖమ్మం: తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో వినూత్న పంథాను అనుసరిస్తోంది. తమ పార్టీ సభ్యత్వం తీసుకుంటే రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా అని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. జిల్లాలో ‘నామ’మాత్రం అవుతున్న ఆ పార్టీ సభ్యత్వ నమోదుకు ఈ కొత్త పాలసీని ఎంచుకుంది. ప్రజా సమస్యలు, వారి తరఫున పోరాటాలు, పరిష్కారాల జోలికి వెళ్తే ఎక్కడ భంగపడాల్సి వస్తుందోనని ఆ పార్టీ ఈ విధానాన్ని అనుసరిస్తోందని ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. ప్రతి క్రియాశీల కార్యకర్తకు రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా అని ఏకంగా కరపత్రాలే పంచుతోంది.
టార్గెట్ పూర్తి చే సేందుకు పడరాని పాట్లు
జిల్లాలో ఈనెల 1వ తేదీ నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో శిక్షణ తీసుకున్న యువకులతో ప్రతి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదును పార్టీ వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేయిస్తున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి సభ్యత్వ నమోదుకు పార్టీ పెద్దలు పలు ఆఫర్లు ప్రకటించారు. ప్రజలను ఆకర్షించేందుకు సభ్యత్వం తీసుకుంటే రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా (ఇన్సూరెన్స్), ప్రమాదవశాత్తు మరణించినా, పూర్తి వైకల్యానికి గురైనా 100 శాతం బీమా, ఇలా రకరకాలుగా బీమా ఆఫర్లు పెట్టి సభ్యత్వ నమోదుకు జిల్లా పార్టీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు.
రాయితీలు ఇవ్వడానికి ఇటు హైదరాబాద్, అటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు నెట్‌వర్క్ ఆస్పత్రులను సూచించారు. ఆఫర్లతో కూడిన కరపత్రాలతో ప్రచారం చేస్తూ.. సభ్యత్వాలు నమోదు చేస్తున్నారు. ఓట్లు వేసిన తర్వాత ఏదైనా సమస్య వస్తే మొహం చాటేసే నేతలు.. ‘సభ్యత్వం తీసుకుంటే ఇవన్ని కల్పిస్తారా’..? ఇదంతా వట్టి ప్రచారమే అని పలువురు తిప్పికొడుతున్నారు. ఈ బంపర్ ఆఫర్‌ను నమ్మిని కొందరు మాత్రం టీడీపీ సభ్యత్వం తీసుకుంటున్నారు. ఆఫర్ ప్రకటించినా ఆశించినస్థాయిలో స్పందన రాకపోవడంతో టార్గెట్ ఎలా పూర్తవుతుందోనని ఆయా నియోజకవర్గాల నేతలు తల పట్టుకుంటున్నారు.
జిల్లాలో పట్టుకోసం..
తెలుగుదేశం పార్టీ జిల్లాలో పూర్వ వైభవాన్ని కోల్పోయింది. అప్పటి పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు, మరో నేత నామా నాగేశ్వరరావుల మధ్య వైరం తారాస్థాయికి చేరి.. తుమ్మల పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన వెంటే అధిక సంఖ్యలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నడిచారు. గతంతో తెలంగాణలోనే జిల్లాలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం ఈ పరిణామాలతో పట్టుకోల్పోయిందని చెప్పవచ్చు.
పార్టీ తరఫున ఒకే ఎమ్మెల్యే గెలవడం, జడ్పీ చైర్‌పర్సన్ పదవి కూడా టీఆర్‌ఎస్ ఖాతాలోకి వెళ్లడంతో గ్రామస్థాయిలో టీడీపీ పట్టు తప్పింది. పార్టీ అధిష్టానం పెట్టిన బీమా ఆఫర్లతో సభ్యత్వ నమోదుకు దిగినా.. జిల్లాలో మాత్రం ఆపార్టీ ఆశించిన స్థాయిలో ప్రయోజనం పొందలేక పోతోంది. సభ్యత్వ నమోదు వరకే ప్రమాద బీమా అంటారని, ఆ తర్వాత తాము ఎవరో నాయకులు గుర్తు కూడా పట్టరని.. ప్రజలు ఆ పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. పలు నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైనా.. నత్తనడకనే కొనసాగుతోంది. ప్రమాద బీమా ఆఫర్లపైన ఆపార్టీలోనూ చర్చసాగుతోంది. పార్టీలోని కొంతమంది నేతలు పైకి ఇది మంచి కార్యక్రమం అంటున్నా..ప్రజల నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో కొన్ని మండలాల్లో దీనిపై ప్రచారం చేయడానికి వెనకాడుతున్నారు.
మభ్య పెట్టడమే..
ప్రజా ఉద్యమాలు, సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు వెళ్తున్న పార్టీలకు ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఇలా ఆయా పార్టీలకు ఆకర్షితులవుతున్న వారే సభ్యత్వం నమోదు చేసుకుంటారు. కానీ టీడీపీ బీమా ఆఫర్ ప్రజలు, ఆ పార్టీ కార్యకర్తలను మభ్య పెట్టడమే అని ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. గతంలో సభ్యత్వ నమోదు కోసం ఎలాంటి ఆఫర్లు పెట్టలేదని, ఇలా చేయడం ఆ పార్టీ నైతికతను దెబ్బతీసినట్లేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మార్కెట్‌ను విస్తృతం చేసుకోవడానికి, నష్టాలను పూడ్చుకోవడానికి మాత్రమే కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయని..టీడీపీ ప్రకటించిన ఈ బీమా ఆఫర్ ఆ పార్టీ హీనస్థితికి నిదర్శనమని పేర్కొంటున్నారు.