ఐటీలో హైదరాబాద్ ప్రాధాన్యత తగ్గదు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినంత మాత్రాన ఐటీ రంగంలో హైదరాబాద్‌కు ఉన్న ప్రాధాన్యత, ప్రత్యేకత ఎక్కడికీ పోదని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం న్యూఢిల్లీలో తన శాఖ 100 రోజుల పాలన ప్రగతి నివేదికను వివరిస్తూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాతో మాట్లాడారు. ఇద్దరూ ఐటీపై అమితమైన ఆసక్తి కనబరిచారు. ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లను ఏర్పాటుచేయాలని కోరారు.
వాటిపై దృష్టిపెడతాం..’ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాను బెదిరిస్తున్నారని, దీనిపై మీ స్పందనేమిటని ఓ విలేకరి ప్రశ్నించగా ‘పత్రికా స్వేచ్ఛకు కట్టుబడి ఉంటాం. అందరూ పత్రికా స్వేచ్ఛకు విలువనివ్వాలి’ అని పేర్కొన్నారు.