కళ్లముందే కొట్టుకుపోయారు | they disappeared before our eyes only | Sakshi
Sakshi News home page

కళ్లముందే కొట్టుకుపోయారు

Published Thu, Jun 12 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM

కళ్లముందే కొట్టుకుపోయారు

కళ్లముందే కొట్టుకుపోయారు

‘‘అప్పటి వరకు మాతోపాటే ఆడిపాడిన మిత్రులంతా క్షణాల వ్యవధిలోనే కనుమరుగయ్యారు. కళ్లముందే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. కాపాడమంటూ వారు కేకలు వేసినా మేమేం చేయలేకపోయాం. స్థానికుల సాయం కోసం మేము ఎంతగా ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదు..పోలీసులు కూడా సకాలంలో స్పందించలేదు. ఆ దుర్ఘటన నుంచి తప్పించుకున్నందుకు ఆనందపడాలో...ప్రాణ స్నేహితులను కాపాడుకోలేకపోయినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు.’’ బియాస్ నది వద్ద జరిగిన ఘోర దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన జిల్లాకు చెందిన విద్యార్థి శ్రీకాంత్ ఆవేదన ఇది.
 
 మిరుదొడ్డి: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గత ఆదివారం 24 మంది విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు గల్లంతుకాగా, ఆ బృందంలోని శ్రీకాంత్ బుధవారం మిరుదొడ్డి మండలంలోని తన స్వగ్రామం మోతెకు సురక్షితంగా చేరుకున్నాడు. దీంతో అతనిరాక కోసం కళ్లల్లో వత్తులేసుకుని ఎదురుచూసిన తల్లిదండ్రులు కోరంపల్లి నర్సింహారెడ్డి, అంజమ్మలు ఒక్కసారిగా గుండెలకు హత్తుకుని కన్నీరుమున్నీరయ్యారు. బంధువులు, మోతె గ్రామస్తులు సైతం భారీగా తరలివచ్చి శ్రీకాంత్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన దుర్ఘటనకు సంబంధించి శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన విషయాలు అతని మాటల్లోనే...
 
 వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న 48 మంది విద్యార్థులం ఈ నెల 3వ తేదీన విహారయాత్రకు బయలుదేరాం. మా వెంట కళాశాలకు చెందిన ముగ్గురు లెక్చరర్లు కూడా ఉన్నారు. మేమంతా హైదరాబాద్ నుంచి దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి 5వ తేదీ ఆగ్రా చేరుకున్నాం.
 
 అక్కడ చూడవలసిన ప్రదేశాలను వీక్షించి..అక్కడి నుండి ఢిల్లీ బయలుదేరి వెళ్లాం. డిల్లీలో కొన్ని ప్రదేశాలను తిలకించిన అనంతరం ఈ నెల 8వ తేదీఆదివారం ఉదయం కులూమానాలికి చేరుకున్నాం. సాయంత్రం ఆరున్నర గంటల సమయానికి బియాస్ నది వద్దకు చేరుకున్నా. చూడగానే ఆకట్టుకున్న ఆ ప్రదేశంలో కాసేపు గడపాలని భావించి అందరం నది వద్దకు వెళ్లాం. నా మిత్రులంతా బియాస్ నదిలోకి దిగి ఫొటోలు దిగుతుండగా, మిగిలిన కొంతమంది మిత్రులకోసం నేను నది గట్టుపైకి వెళ్లాను. ఉన్నట్టుండి నదిలోని ఓ పెద్ద బండరాయిపై నిలుచున్న 15 మంది మా ఫ్రెండ్స్ కేకలు పెట్టడం వినిపించింది. వెంటనే ఆ వైపు చూడగా, ఉన్నట్టుండి ఉధృతంగా వచ్చిన నీరు మా ఫ్రెండ్స్ ఉన్న బండరాయి చుట్టూ చేరింది. వారిని రక్షించడానికి మేము చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. రక్షించమని కేకలు వేశాం. రెండు  నిమిషాల్లోనే 15 మంది మిత్రులు వరదలో కొట్టుకుపోయారు. ఆ వరదనీటిలో సుమారు కిలోమీటర్ దూరం వరకు కనిపించిన వారు ఆపై కనుమరుగ య్యారు. అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ, వారు పూర్తిస్థాయిలో స్పందించలేకపోయారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎముకలు కొరికే చలిలో నరకం అనుభవించాం.
 
 ప్రభుత్వానికి కృతజ్ఞతలు
 హిమాచల్ ఘటపై సీఎం కేసీఆర్, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తీసుకున్న సహాయ చర్యల మూలంగా తాను పుట్టిన గడ్డపై అడుగు పెట్టానని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో ఆ విమానంలోనే తాను హైదరాబాద్ చేరుకున్నానని తెలిపాడు.  
 
 దేవుళ్లందరికీ మొక్కుకున్నాం
 దుర్ఘటన గురించి తెలుసుకున్న వెంటనే మా కుమారుడ్ని కాపాడాలంటూ దేవుళ్లందరికీ మొక్కుకున్నాం. కొన్ని గంటలపాటు ఏమైందో... మా బిడ్డ ఎలా ఉన్నాడోనంటూ క్షణమొక యుగంలా గడిపాం. ఎట్టకేలకు నేను క్షేమంగా ఉన్నానంటూ శ్రీకాంత్ ఫోన్ చేసేవరకూ ఉగ్గబట్టి ఎదురుచూశాం. ఆ భగవంతుడి దయ వల్ల మా బిడ్డ క్షేమంగా ఇల్లు చేరుకోవడం సంతోషంగా ఉంది.
 -శ్రీకాంత్‌రెడ్డి తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, అంజమ్మ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement