హైదరాబాద్ : జంటనగరాల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలతో ప్రజలకు, పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే కాకుండా, యజమానులు ఉన్న ఇళ్లను వదలకుండా దోచేస్తున్నారు. కూకట్‌పల్లి సుమిత్రానగర్‌లోని వీబీఆర్ రెసిడెన్సీలో శనివారం వేకువజామున చోరీ జరిగింది. ఫ్లాట్ నెం.203 లో ఉంటున్న వృద్ధ దంపతులు పండుగకు చెన్నైకి వెళ్లారు.
ఉదయం అనూహ్యంగా ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చిన ఇంటి చుట్టుపక్కల వారు కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. చెన్నైలో ఉన్న యజమానులకు పోలీసులు సమాచారం అందించారు. చోరీ సొత్తుపై ఇంటి యజమానులు వస్తే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు.