- ఊపందుకున్న నామినేషన్ల ప్రక్రియ
- శుక్రవారం అధిక సంఖ్యలో పడ్డ నామినేషన్లు
- పార్టీ తరఫున.. స్వతంత్ర అభ్యర్థులుగానూ దాఖలు
సాక్షి, సిటీబ్యూరో: ‘గ్రేటర్’లో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. శుక్రవారం ముహూర్తం బాగుందన్న సెంటిమెంట్‌తో 39 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలు అధికారిక అభ్యర్థుల్ని ప్రకటించకముందే ఆ పార్టీలకు చెందిన పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఒకే నియోజకవర్గం నుంచి ఒకే పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. ఇందుకు ఎవరి కారణాలు వారికున్నాయి.
శుక్రవారం మంచిరోజైనందున నామినేషన్లు వేశామని కొందరు ప్రకటించగా.. అధికారికంగా వెల్లడయ్యాక మరోమారు నామినేషన్ దాఖలు చేస్తామన్నవారు కూడా ఉన్నారు. కాగా.. ఆయా పార్టీల్లో పొత్తుచిక్కులు తేలకపోవడంతో, ఎక్కడ తమకు సీటు రాకుండా పోతుందోననే ఆందోళనతో నామినేషన్లు వేసినవారూ ఉన్నారు. నామినేషన్ వేసినందున ఆ తర్వాతైనా అధిష్టానాన్ని ఒప్పించగలమన్న ధీమాతో నామినేషన్ వేసినవారూ వీరిలో ఉన్నారు. ఆయా పార్టీల నడుమ పొత్తులతో కొందరు.. తాము కోరుకున్న సీటు తమకు రాకుండా పోతుందేమోననే సందేహంతో ఇంకొందరు ఎందుకైనా మంచిదనే తలంపుతో నామినేషన్లు దాఖలు చేశారు.
మంత్రులు సైతం...
అధికారిక ప్రకటనకు ముందే నామినేషన్లు దాఖలు చేసిన వారిలో మంత్రులు సైతం ఉండటం విశేషం. మిగతా వారి సంగతటుంచి తాజా మాజీ మంత్రులైన ఎం. ముఖేశ్‌గౌడ్, దానం నాగేందర్‌లతో పాటు ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ వంటి వారు కూడా ఉండటం ‘గ్రేటర్’లో చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. వాస్తవానికి దానం నాగేందర్, ముఖేశ్‌లు తమ నియోజకవర్గాలు మారాలనుకున్నారు.
దానం నాగేందర్ నాంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో పెరిగిన వ్యతిరేకత తదితర అంశాలతో ఆయన ఈసారి ఎన్నికల్లో నాంపల్లి నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని భావించినా.. అధిష్టానం అందుకు నో అనడంతో ఖైరతాబాద్ నుంచే పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖేశ్‌గౌడ్‌కు సైతం గోషామహల్‌లో పెరిగిన వ్యతిరేకతతో ఆయన ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి కానీ.. అధిష్టానం అనుగ్రహిస్తే సికింద్రాబాద్ లోక్‌సభకు కానీ పోటీ చేయాలనుకున్నారు.
రెంటికీ చుక్కెదురవడంతో గోషామహల్ నుంచే తిరిగి పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు సెట్ల నామినేషన్లు వేసిన ఆయన ఒకటి కాంగ్రెస్ పేరుతో, మరొకటి ఇండిపెండెంట్‌గా దాఖలు చేశారు. కుత్బుల్లాపూర్ నుంచి కూన శ్రీశైలంగౌడ్ సైతం కాంగ్రెస్ పేరిట రెండు సెట్లు.. ఇండిపెండెంట్‌గా రెండు సెట్ల నామినేషన్లు వేశారు. ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణతో ఉన్న విభేదాల కారణంగా ముందస్తు జాగ్రత్తగా నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది.
మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎంతోకాలంగా ఎదురు చూస్తోన్న టీడీపీ నాయకుడు తీగల కృష్ణారెడ్డి.. తన అనుచరులతో కలిసి ఆ సీటును బీజేపీకి ఇవ్వవద్దంటూ చంద్రబాబును కోరిన మర్నాడే.. ఎందుకైనా మంచిదని నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం మంచి రోజనే నమ్మకంతో నామినేషన్లు వేసిన వారూ ఉన్నారు.
వివిధ పార్టీలవారు, ఇండిపెండెంట్లు వీరిలో ఉన్నారు. పార్టీ అధిష్టానం నుంచి అందిన సమాచారం మేరకే నామినేషన్లు వేశామన్నవారూ వీరిలో ఉన్నారు. ఆయా పార్టీల నుంచి తమకు టికెట్ లభించగలదనే నమ్మకంతోనూ.. అధిష్టానం నుంచి అందిన సమాచారంతోనే పలువురు నామినేషన్లు వేసినప్పటికీ.. అనూహ్యంగా తమకు టికెట్ రాకుంటే ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.