తెలంగాణ ప్రాంతంలో లోక్సభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు నేటి (బుధవారం)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాలలో పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేస్తున్నారు. మల్కాజ్గిరి లోక్ సభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అలాగే నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానానికి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి నామినేషన్ వేశారు. మెదక్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయశాంతి, ఖమ్మం జిల్లా పాలేరులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాంరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ జిల్లా హుజూర్ నగర్లో కాంగ్రెస్ నేత ఉత్తమ్కుమార్ రెడ్డిలు తమ తమ నామినేషన్ దాఖలు చేశారు.
మెదక్ పార్లమెంట్ స్థానానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన సంగరెడ్డి నుంచి గజ్వేల్ బయలుదేరి వెళ్లారు. గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి కూడా నేడు కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. మెదక్ పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ స్థానానికి కూడా కేసీఆర్ పోటీ చేయునున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల అసెంబ్లీ స్థానానికి టీఆర్ఎస్ నేత కేటీఆర్,అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన కొండూరి రవీందర్రావులు నామినేషన్లు వేశారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా డా.కె.లక్ష్మణ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మం జిల్లా వైరా స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా బానోతు చంద్రావతి నామినేషన్ దాఖలు చేశారు.