యాదాద్రిలో ప్రొటోకాల్‌ పంచాయితీ | TRS Leaders Complaint Against Yadadri EO Geeta Reddy | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో ప్రొటోకాల్‌ పంచాయితీ

Published Sun, Nov 24 2019 8:38 AM | Last Updated on Sun, Nov 24 2019 8:38 AM

TRS Leaders Complaint Against Yadadri EO Geeta Reddy - Sakshi

మామిడి తోరణం, పూలతో అలంకరించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసిన గోశాల

యాదగిరిగుట్ట (ఆలేరు) : ఒకరు మహిళ అధికారి.. మరొకరు మహిళ ప్రజాప్రతినిధి.. వారిద్దరి మధ్య నువ్వానేనా అన్న తరహాలో వార్‌ నడుస్తోంది. అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ పాటించడం లేదంటూ.. స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం ఆహ్వానాలు ఇవ్వడం లేదంటూ అధికారిపై గతంలో మంత్రులకు, ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. నిన్నటివరకు ఈ ప్రొటోకాల్‌ విషయం లోలోపలనే ఉన్నా.. శనివారం జరగాల్సిన ఓ కార్యక్రమానికి ఆ ప్రజాప్రతినిధితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం లేదని ఆమె అనుచరులంతా ఆ అధికారిపై ఉన్నతస్థాయి అధికారులకు మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన యాదగిరిగుట్టలో శనివారం చోటు చేసుకుంది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈఓ గీతారెడ్డి.. ఆలయానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ఏవీ చేసినా ప్రభుత్వ విప్‌ గొంగిడి సునితామహేందర్‌రెడ్డికి, ఎంపీ, ఎమ్మెల్సీలతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానం ఇవ్వడం లేదని, కనీసం ప్రొటోకాల్‌  పాటించడం లేదంటూ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సందర్శనకు వచ్చిన సీఎస్‌ జోషి దృష్టికి తీసుకెళ్లారు.

అసలేమీ జరిగిందంటే...
యాదాద్రి దేవస్థానం ఆధీనంలో ఉన్న నల్లపోచమ్మవాడలోని గోశాలను మల్లాపురం మార్గంలో ఉన్న దేవస్థానం బావి వద్ద నూతనంగా నిర్మించిన తులసీ వనానికి తరలించారు. కొంతకాలంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. శనివారం తులసీ వనంలో నిర్మించిన నూతన గోశాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడంతోపాటు వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన భోజనాలకు వచ్చిన సీఎస్‌ జోషితో ప్రారంభించాలని అధికారులు అంతా సిద్ధం చేశారు. కానీ చివరి నిమిషంలో ప్రొటోకాల్‌ పాటించడం లేదని ప్రారంభోత్సవాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత అనుచరులు అడ్డుకుంటారని చేయలేదు. పూలతో అలంకరణతోపాటు టెంకాయలు, ప్రారంభో త్సవ రిబ్బన్‌ కూడా సిద్ధం చేసి చివరికి ప్రారంభం చేయకుండా వాటిని తొలగించడంతో అక్కడున్న ఆచార్యులు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. 

ప్రజాప్రతినిధులు రావడంతోనే..
ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతతోపాటు ఎంపీ, ఎమ్మెల్సీ, స్థానిక ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, కనీసం ప్రొటోకాల్‌ పాటించకుండానే గోశాలను ఎలా ప్రారంభిస్తారో చూడాలని ఈఓ గీతారెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, మల్లాపురం సర్పంచ్‌ కర్రె వెంకటయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు పెద్దఎత్తున గోశాలకు చేరుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆలయ అధికారులు ప్రారంభోత్స వానికి సిద్ధం చేసిన రిబ్బన్‌ను తొలగించి, అలంకరణ మాత్రమే ఉంచారు. ప్రజాప్రతినిధులు గొడవకు దిగుతారనే ముందుగా గ్రహించిన ఈఓ గీతారెడ్డి ప్రారంభోత్సవం రద్దు చేశారని టీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. ఎలాంటి ప్రారంభోత్సవం లేనప్పుడు హంగులు, ఆర్భాటాలు ఎందుకని ప్రశ్నించారు. గతంలో కూడా ఈఓ గీతారెడ్డి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌గా ఉన్న గొంగిడి సునితామహేందర్‌రెడ్డికి ప్రొటోకాల్‌ పాటించడం లేదని, రెండేళ్ల క్రితం బ్రహ్మోత్సవాల సమయంలో కరపత్రాలపై విప్‌ సునీత పేరు ముద్రించడంలో తప్పులు చేశారని ఆరోపించారు. అంతేకాకుండా ఆలయానికి వచ్చిన సందర్భంలో ఆమెను సరిగా ఆహ్వానించరని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈఓపై చర్యలు తీసుకోవాలి..
ప్రొటోకాల్‌ పాటించకుండా స్థానిక ప్రజాప్రతినిధులను అవమాన పరుస్తున్న ఆలయ ఈఓ గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, మల్లాపురం సర్పంచ్‌ కర్రె వెంకటయ్య, టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యదర్శి ఆరె యాదగిరిగౌడ్, మిట్ట వెంకటయ్యగౌడ్, యువజన విభాగం కన్వీనర్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌ల ఆధ్వర్యంలో సీఎస్‌ జోషికి వినతిపత్రం అందజేశారు. సీఎం కేసీఆర్‌ రూ.వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారని, కానీ శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యేను, ఎంపీని, ఎమ్మెల్సీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లను ఆహ్వానించకుండా అగౌరవపరుస్తున్నారని తెలిపారు. ఈఓ వచ్చిన నాటినుంచి ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

రోజుకో రాయికి పూజలు చేస్తాం.. 
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండపైన ప్రతి రోజూ ఒక రాయికి పూజలు చేస్తాం. వాటన్నింటికి పిలవాలని లేదు. ప్రధాన ఆలయం ప్రారంభోత్సవంతోనే మిగతా ప్రారంభోత్సవాలు జరుగుతాయి. ఇప్పటి వరకు ఎక్కడ ప్రారంభోత్సవాలు జరగలేదు. పాత గోశాలను మల్లాపురం రోడ్డులో నూతనంగా నిర్మితం గోశాలకు తరలించాలని వైటీడీఏ అధికారులు ఆదేశించారు. కానీ దీనికి ఎవరిని మేము పిలవలేదు. –గీతారెడ్డి, ఈఓ, యాదాద్రి దేవస్థానం
 
ఆహ్వానం అందలేదు.. వాస్తవమే 
యాదాద్రి దేవస్థానానికి సంబంధించిన గోశాల ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వానం అందలేదు. ఇది వాస్తవమే. గతంలో ఒకటి, రెండు సార్లు ఇలాంటి సంఘటనలకు మమ్మల్ని ఆహ్వానించలేదు. అయినా మేము ఎక్కడ కూడా ఈఓను ఇబ్బంది పెట్టలేదు. సీఎం కేసీఆర్‌ గొప్ప సంకల్పంతో యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని, ప్రొటోకాల్‌ విషయాన్ని ఎప్పుడూ అంతగా పట్టించుకోలేదు. – గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement