
తెలంగాణ అభివృద్ధికి కాళ్లలో కట్టెలు
దేశంలోనే ఆదర్శంగా నిలవాలన్న ఆలోచనతో ముందుకు సాగుతుంటే చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాభివృద్ధికి కాళ్లలో కట్టెలు పెట్టినట్టుగా అడ్డు తగులుతోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ దుయ్యబట్టారు.
కాంగ్రెస్ తీరుపై మంత్రి ఈటల ధ్వజం
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఆదర్శంగా నిలవాలన్న ఆలోచనతో ముందుకు సాగుతుంటే చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాభివృద్ధికి కాళ్లలో కట్టెలు పెట్టినట్టుగా అడ్డు తగులుతోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. తమ పరిపాలనా దక్షతను జీర్ణించుకోలేని కాంగ్రెస్ పదవే పరమావధిగా, అధికారమే ధ్యేయంగా బతికే పార్టీ అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏ పార్టీ దయా దాక్షిణ్యాల మీద రాలేదని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘బరిగీసి కొట్లాడినం, బలిదానాలు చేసినం... రక్తం చిందించి రాష్ట్రం సాదించుకున్నం’’అని పేర్కొన్నారు. గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో శాసన మండలి చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో జంకకుండా, వెరవకుండా, అవమానాలను దిగమింగుతూ చిత్తశుద్ధితో పోరాడి రాష్ట్రాన్ని సాధించామని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రజలిచ్చిన బాధ్యతను నెరవేర్చేందుకు అంతే బాధ్యతతో రాష్ట్రం గొప్పగా ఎదగాలని పని చేస్తున్నామన్నారు.
ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు: 2004లో జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు మొదలు పెట్టిన కాంగ్రెస్...తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసిందని మంత్రి ఈటల ప్రశ్నించారు. రూ. 400 కోట్ల అంచనాలతో రెండేళ్లలో పూర్తి చేస్తామన్న మిడ్ మానేరును పదేళ్ల పాలనలో పూర్తి చేయకుండా రైతుల కళ్లలో మట్టికొట్టిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కాలయాపన వల్ల రూ. 16 వేల కోట్లతో ప్రారంభమైన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 35 వేల కోట్లకు చేరుకుందన్నారు. కాంగ్రెస్ వాలకం, విధానాలు దేశమంతా తెలుసని, అందరూ ఛీ కొడుతున్నా పదవి వస్తుందన్న దింపుడు కల్లం ఆశతో ఉందని ఎద్దేవా చేశారు.
పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కొండ పోచమ్మ ప్రాజెక్టుకు 4,630 ఎకరాలు అవసరమైతే అందులో 4,507 ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించిందని, కేవలం 123 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఆరుగురు కాంగ్రెస్ నేతలు కోర్టుకెళ్లి అడ్డుపడుతున్నారని విమర్శించారు. హిమాన్షు మోటర్స్‌లో 2007 నుంచి లావాదేవీలు జరగడం లేదని చెబుతున్నా షబ్బీర్ అలీ వంటి నేతలు పాత పాటే పాడుతున్నారని మండిపడ్డారు.