కోతుల లొల్లిని పట్టించుకోరేం..?
అసెంబ్లీలో మంత్రిని నిలదీసిన అధికారపక్ష సభ్యులు
⇒ పంటలు ధ్వంసం చేస్తున్నా చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం
⇒ ఒక్క ఫిర్యాదూ రాలేదన్న మంత్రి జోగు రామన్న
⇒ దైవస్వరూప భావన వల్ల ఏం చేయలేకపోతున్నామని వ్యాఖ్య
⇒ సమస్య పరిష్కారానికి త్వరలో ఎమ్మెల్యేలతో భేటీ అవుతానని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో మరోసారి కోతుల లొల్లిపై తీవ్ర చర్చ జరిగింది. ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై పార్టీలకతీతంగా సభ్యులు ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన కనిపించకపోవటంపట్ల సభ్యులు మండిపడ్డారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని అధికార పార్టీ సభ్యుడు జలగం వెంకట్రావు ప్రస్తావించారు. కోతులు పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నా ప్రభుత్వం సమస్య పరిష్కారానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై అటవీశాఖ మంత్రి జోగు రామన్న స్పందిస్తూ కోతులు, పాములను దైవస్వరూపంగా భావించే సంప్రదాయం ఉన్నందున వాటి విషయంలో కఠినంగా వ్యవహరించే వీలు లేదని వణ్యప్రాణుల చట్టం చెబుతోందన్నారు.
ఈ విషయంలో ప్రభుత్వం గతంలో విడుదల చేసిన ఉత్తర్వులో ఈ రెండింటినీ మినహాయించినట్లు సభ దృష్టికి తెచ్చారు. అయితే కోతులను జాబితా నుంచి మినహాయించామని చేయి దులుపుకొంటే ఎలా అని ప్రశ్నించిన వెంకట్రావు... వాటిని కూడా చేరుస్తూ మరో ఉత్తర్వు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో అధికార పార్టీకి చెందిన మరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు జోక్యం చేసుకుని కోతులు పంటలకు నష్టం చేస్తుండటం వల్ల కొందరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఇది చాలా తీవ్రమైన విషయమన్నారు. కోతులను తరిమేందుకు కనీసం కొండెంగలనైనా సరఫరా చేయాలని కోరారు. కొండెంగలతో ప్రయోజనం లేదని, వాటిని కోతులు కరిచి తరిమేస్తున్నాయని స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు.
కోతులను పట్టుకుంటే రూ. 300 చొప్పున చెల్లిస్తాం: జోగు రామన్న
గతంలో హిమాచల్‌ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు చేపట్టిన కోతుల నియంత్రణ చర్యలను పరిశీలించామని, కానీ అవి ఆశాజనకంగా లేవని ఆ రాష్ట్రాలే ప్రకటించాయని మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో మూడు లక్షల కోతులుంటే కేవలం 9 వేల కోతులనే పట్టుకోగలిగారన్నారు. ప్రస్తుతం కోతులను పట్టడంలో నైపుణ్యం ఉన్నవారూ దొరకడం లేదన్నారు. ఎవరైనా కోతులను పట్టుకుంటే రూ. 300 చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కోతుల వల్ల పంట నష్టం జరుగుతోందన్న ఫిర్యాదు ఇప్పటివరకు రాలేదని, సమస్య పరిష్కారానికి త్వరలో ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
కోతుల గురించి శాసనసభలో మాట్లాడుతుంటే తమాషా అనుకుంటున్నారేమో... ఇది చాలా తీవ్రమైన సమస్య. కానీ మంత్రిగారు అసలు సమస్యే లేదన్నట్టు స్పందించడం సరికాదు
– అధికారపక్ష సభ్యుడు జలగం వెంకట్రావు
కోతుల బెడదతో రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోంది. పంట చేతికందే సమయంలో దాడి చేస్తున్న కోతులు రైతును తీవ్ర నష్టాలకు గురిచేస్తున్నాయి. దీన్ని అటవీశాఖ మంత్రి ఎందుకు తీవ్రంగా పరిగణించడంలేదో అర్థంకావట్లేదు
– అధికారపక్ష సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు
కోతుల వల్ల పంట నష్టం జరిగినట్టు ఒక్క ఫిర్యాదూ అందలేదు. అయినా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం
– అటవీశాఖ మంత్రి జోగు రామన్న