సాక్షిప్రతినిధి, నల్లగొండ : గులాబీ పార్టీలో పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో శుక్రవారం జరగనున్న టీఆర్‌ఎస్ 17వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్లీనరీ నిర్వహిస్తోంది. ఏటా ఏప్రిల్ 27వ తేదీన జరిగే ప్లీనరీలోనే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికలు ఏడాది లోపే ఉండడంతో ఈ ప్లీనరీకి ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో ప్రతినిధుల సభకు హాజరయ్యేందుకు పార్టీ నాయకులు ఉత్సాహ పడుతున్నారు.
నాలుగేళ్లు పాటు సాగిన టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టిన పథకాలు, వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం అమలు చేసిన కార్యక్రమాలపై ప్రగతి నివేదికలను పార్టీ కార్యకర్తలకు అందివ్వనున్నారు. పార్టీ, ప్రభుత్వం జోడెడ్ల మాదిరిగా కలిసి సాగాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పదే పదే చెబుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు, ప్రజల్లో ప్రచారం చేసేందుకు పార్టీ యంత్రాంగాన్ని వినియోగించుకోనున్నారని చెబుతున్నారు.
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున పార్టీ ప్లీనరీ ఉండదని, దీంతో ఈ ప్లీనరీ పా ర్టీకి ప్రత్యేకమైనదని అంటున్నారు. ఈ కారణంగానే కీలకమైన ఈ ప్లీనరీలో పాల్గొనేం దుకు నల్లగొండ ఉమ్మడి జిల్లా నాయకులు, ద్వితీయ శ్రేణి, పార్టీ తరఫున వివిధ పదవుల్లో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధుల, పార్టీ పదవుల్లో ఉన్నవారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నియోజకవర్గానికి నూరు మందికి ఆహ్వానం
టీఆర్‌ఎస్ 17వ ప్లీనరీలో మొత్తంగా 15వేల మంది ప్రతినిధులు మాత్రమే పాల్గొంటారని, ఆ మేరకే ఆహ్వానాలు ఉన్నాయని గులాబీ నేతలు చెబుతున్నారు. దీంతో జిల్లాల వారీగా ఇచ్చిన కోటాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఈసారి ప్రతి నియోజకవర్గానికి వంద మందికే ఆహ్వానాలు పంపారని, ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మొత్తంగా 1200 మందికి ఆహ్వానాలు అందాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ప్రతిసారి నిర్ధిష్టంగా కొంత మందికే ఆహ్వానాలు ఇస్తున్నా, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలోనే ప్లీనరీకి హాజరవుతున్నారని చెబుతున్నారు. ఈసారి కూడా ఆహ్వానాలకు రెండింతల మంది ప్లీనరీకి తరలిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాలోని 12 స్థానాల్లో టీఆర్‌ఎస్ చేతిలో ఎనిమిది మంది (చేరికల ఎమ్మెల్యేలు సహా) ఎమ్మెల్యేలు ఉన్నారు. కోదాడ, హుజూర్‌నగర్, నల్లగొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జులు ఉన్నారు. ప్లీనరీకి హాజరయ్యేందుకు తమకు పాసులు ఇప్పించాలని ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులపై ఒత్తిడి పెరిగిందని పేర్కొంటున్నారు. వీరే కాకుండా జిల్లానుంచి మరికొందరు కార్పొరేషన్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక మండలి చైర్మన్, సభ్యులు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
వీరే కాకుండా టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీలో ప్రాతిని ధ్యం వహిస్తున్నవారు. పార్టీ అనుంబంధ సంఘాల్లో ఉన్న వారు ఇలా.. వివిధ పదవుల్లో ఉన్న నేతలంతా ప్లీనరీకి హాజరుకావడానికి సిద్ధమవుతున్నారు. ప్లీనరీలో పాల్గొనడం ప్రత్యేకతగా భావిస్తున్న కేడర్ ఈ మేరకు తమ నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. గడిచిన రెండు మూడు రోజులుగా ప్లీనరీలో పా ల్గొనే వారి జాబితాల తయారీ, ఇతర ఏర్పాట్లతో జిల్లా టీఆర్‌ఎస్‌లో సందడి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment