
గులాబీ.. గాలి
- టీఆర్‌ఎస్‌కు 2 ఎంపీ... 8 ఎమ్మెల్యే సీట్లు
- టీడీపీకి రెండు, కాంగ్రెస్‌కు ఒకటి మాత్రమే
- పొన్నాలకు సవాల్ విసిరి... గెలిచిన దొంతి మాధవరెడ్డి
- పాలకుర్తిలో మూడో స్థానంలో టీఆర్‌ఎస్
- ‘కారు’ జోరులోనూ గెలవని సత్యవతి రాథోడ్
- సిట్టింగ్ స్థానం పరకాలను కోల్పోయిన టీఆర్‌ఎస్
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లాలో గులాబీ గాలి వీచింది. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఎనిమిది స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది టీఆర్‌ఎస్‌కు దక్కాయి. రెండు స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాయి. కాంగ్రెస్ చివరి సమ యంలో టికెట్ నిరాకరించడంతో నర్సంపేట నుంచి రెబల్‌గా బరిలో దిగిన డీసీసీ మాజీ అధ్యక్షుడు దొంతి గెలుపొందారు.
1994 ఎన్నికల్లో టీడీపీ అనుకూల పవనాల్లో జిల్లాలో ఆ పార్టీకి 9 స్థానాలు వచ్చాయి. 13 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క డోర్నకల్ సీటు మాత్రమే వచ్చింది. డీఎస్.రెడ్యానాయక్ మాత్రమే గెలిచారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ తరపున ఆయన ఒక్కరే గెలిచారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఏకంగా 32 వేల ఓట్ల తేడాతో దారుణంగా ఓడిపోయారు.
టీఆర్‌ఎస్ రికార్డ్
తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న జిల్లాలో టీఆర్‌ఎస్‌కు రికార్డు స్థాయిలో సీట్లు వచ్చాయి. 12 సీట్లలో ఏకంగా ఎనిమిది సీట్లు గెలిచింది. 2004 మాదిరిగానే రెండు లోక్‌సభ సీట్లను దక్కించుకుంది. వరంగల్‌లో కడియం శ్రీహరి, మహబూబాబాద్‌లో ఎ.సీతారాంనాయక్ విజయం సాధిం చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా బరిలో నిలిచిన దాస్యం వినయ్‌భాస్కర్ వరంగల్ పశ్చిమలో, తాటికొండ రాజయ్య స్టేషన్‌ఘన్‌పూర్‌లో వరుసగా మూడోసారి గెలిచారు.
జనగామ, వరంగల్ తూర్పు, భూపాలపల్లి, ములుగు, వర్ధన్నపేట, మహబూబాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఓడించారు. అయితే టీఆర్‌ఎస్ పరకాల సిట్టింగ్ స్థానాన్ని పోగొట్టుకుంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతికి బదులుగా న్యాయవాదుల జేఏసీ నాయకుడు ముద్దసాని సహోదర్‌రెడ్డికి టీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చింది. కానీ.. ఆయనకు గెలుపు దక్కలేదు. టీఆర్‌ఎస్ ఆవిర్భా వం నుంచి పార్టీలో ఉన్న పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఎమ్మెల్యే కావాలనే కల నెరవేరలేదు. టీఆర్‌ఎస్ అనుకూల పవనాల్లోనూ ఆయన నర్సంపేటలో ఓడిపోయారు.
ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరిన డోర్నకల్ తాజా మాజీ ఎమ్మెల్యే సత్యవతిరాథోడ్ పరాజయం పాలయ్యారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించిన పాలకుర్తిలో ఆ పార్టీ అభ్యర్థి ఎన్.సుధాకర్‌రావు మూడో స్థానంలో నిలిచారు. టీఆర్‌ఎస్ అనుకూల పవనాల్లో పార్టీ అభ్యర్థి ఇలా మూడో స్థానంలో నిలవడం గమనార్హం.
గెలుపు దక్కని బీజేపీ...
దేశవ్యాప్తంగా పని చేసిన నరేంద్రమోడి ప్రభావం తెలంగాణలో పని చేయలేదు. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో అస్సలు పని చేయలేదు. బీజేపీ నుంచి బరిలో దిగిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు మూడో స్థానానికి పరిమితమయ్యారు. బీజేపీ, టీడీపీ మద్దతుతో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పోటీ చేసిన మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగకు కూడా విజయం దక్కలేదు.
కాంగ్రెస్‌కు ఒక్కటే...
తెలంగాణ ఇచ్చింది తామేనని... చెప్పుకుని ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్‌ను ప్రజలు కోలుకోలేని దెబ్బ కొట్టారు. 12 సీట్లలో ఒక్క డోర్నకల్ స్థానం మాత్రమే హస్తగతమైంది. జనగామలో తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య భారీ తేడాతో ఓడిపోయారు. తాజా మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి సైతం ఓటమిపాలయ్యూరు. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా మళ్లీ బరిలోకి దిగిన మాలోతు కవిత, కొండేటి శ్రీధర్‌దీ ఇదే పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతలో ములుగులో పొదెం వీరయ్య, వరంగల్ పశ్చిమలో ఎర్రబెల్లి స్వర్ణ, పాలకుర్తిలో దుగ్యాల శ్రీనివాసరావు, పరకాలలో ఇనుగాల వెంకట్రామిరెడ్డి ఓడిపోయారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరి స్టేషన్‌ఘన్‌పూర్‌లో పోటీ చేసిన జి.విజయరామారావుకు గెలుపు దక్కలేదు. అధ్యాకుల జేఏసీలో కీలకంగా పనిచేసి నర్సంపేటలో కాంగ్రెస్ అభ్య ర్థిగా పోటీ చేసిన కత్తి వెంకటస్వామి దారుణంగా ఓటమి పాలయ్యూరు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో కేంద్ర మంత్రి బలరాంనాయక్ పరాజయం పాలయ్యూ రు. వరంగల్ ఎంపీ సిరిస్లి రాజయ్య ఎక్కువ ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.