బస్సులు నడుపుదామా? వద్దా? | TS Cabinet Meeting On Monday To Discuss The Strategy On Lockdown 4 | Sakshi
Sakshi News home page

బస్సులు నడుపుదామా? వద్దా?

Published Mon, May 18 2020 4:54 AM | Last Updated on Mon, May 18 2020 8:27 AM

TS Cabinet Meeting On Monday To Discuss The Strategy On Lockdown 4 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం నాలుగో విడత లాక్‌డౌన్‌ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సోమవారం సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ఆదివారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు మంత్రివర్గం సమావేశం కానుంది. రాష్ట్రాల పరస్పర అంగీకారంతో అంతర్రాష్ట్ర బస్సులు, వాహన ప్రయాణాలకు తాజా మార్గదర్శకాల్లో కేంద్రం అనుమతిచ్చింది.  (రాష్ట్రంలో కొత్త సడలింపులపై నిర్ణయాలు)

అంతర్‌ జిల్లా బస్సు సర్వీసులు, ఇత ర వాహనాల ప్రయాణాలకు సైతం పచ్చజెండా ఊపింది. ఈ విషయంలో ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ సడలింపులను రాష్ట్రంలో అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి రాష్ట్ర మంత్రివర్గం ఓ నిర్ణ యం తీసుకోనుంది. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులతో పాటు ఆటోలు, ఇతర వాహనాలకు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ వ్యా ప్తి జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికంగా ఉండటం తో ఇక్కడ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లకు అనుమతిచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. ఈ విషయాలపై కేబినెట్‌ కూలంకషంగా చర్చించి నిర్ణ యం తీసుకోనుంది. అలాగే రాష్ట్రంలో పంట సాగు విధివిధానాలపై సైతం చర్చించనున్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించే అవకాశముంది.  (31 దాకా లాక్‌డౌన్‌)

సీట్ల నమూనాలు రెడీ...
ఆర్టీసీ బస్సులను తిప్పేందుకు ప్రభుత్వం అనుమతిస్తే కచ్చితంగా ప్రయాణికుల మధ్య భౌతికదూరం పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లకు సంబంధించి వరుసకు ఒకరే ఉండేలా నమూ నా రూపొందించారు. సూపర్‌ లగ్జరీ విషయం లో రెండు నమూనాలు సిద్ధం చేశారు. వరుసకు ఒకరే ఉండేలా ఒక రకం, మూడు సింగిల్‌ సీట్ల తో వరుసకు ముగ్గురు చొప్పున ఉండేలా రెండో నమూనా సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఓ బస్సును కూడా సీట్లు మార్చి రెడీ చేశారు. 

ఇందులో సీఎం దేనికి అనుమతిస్తే ఆ నమూనాతో బస్సులు తిప్పుతారు. ఇక అంతర్‌రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా.. అది ఇప్పుడే శ్రేయస్కరం కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కర్ణాటకలో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఆ రాష్ట్రానికి తిప్పొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడుల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఎట్టి పరిస్థితిలో ఆయా రాష్ట్రాలకు బస్సులు తిప్పే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు.  

రాజధానిలో లాంగ్‌ రూట్లలో సిటీ బస్సులు! 
హైదరాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగానే నమోదవుతున్నప్పటికీ అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమవడంతో మిగతా ప్రాంతాల మధ్య పరిమిత సంఖ్యలో సిటీ బస్సులు తిప్పేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికిప్పుడు కాకున్నా వచ్చే నెల మొదటి వారం నుంచి వాటిని తిప్పొచ్చన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని కూడా సీఎం ముందుంచనున్నారు. నగరంలో దూరప్రాంత రూట్లుగా ఉన్న 50 మార్గాలను అధికారులు గుర్తించారు. సీటుకు ఒకరు, రెండు సీట్ల మధ్య ఒకరు నిలబడేలా.. వెరసి ఓ వరుసలో ముగ్గురు చొప్పు న ప్రయాణికులను అనుమతిస్తూ తిప్పాలనేది వారి ఆలోచన. 

కండక్టర్లు బస్సులో కాకుండా, ఆయా రూట్ల స్టాపుల్లో ఇద్దరు చొప్పున ఉంటారు. ముందు డోర్‌ వద్ద ఒకరు టికెట్లు జారీ చేస్తుండగా, వెనక డోర్‌ నుంచి దిగే ప్రయాణికుల వద్ద టికెట్లు చెక్‌ చేస్తూ రెండో కండక్టర్‌ డ్యూటీలో ఉంటారు. మధ్యలో రన్నింగ్‌లో ఎవరైనా ప్రయాణికులు బస్సు ఎక్కితే టికెట్‌ తీసుకొనే అవకాశం ఉండనందున రెండో కండక్టర్‌ను పెట్టి చెకింగ్‌ విధులు అప్పగించనున్నారు. ప్రయాణికులు ముందు డోర్‌ నుంచి ఎక్కి వెనుక డోర్‌ నుంచి దిగాల్సి ఉంటుంది. కేవలం లాంగ్‌రూట్లుగా గుర్తించిన మార్గాల్లోనే బస్సులు తిరుగుతాయి. కేసులు ఎక్కువగా ఉన్న మార్గాల్లో తిరగవు. సీఎం ఆదేశం మేరకు ఈ విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement