సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాణాంతక వైరస్ నేపథ్యంలో మృతదేహాలకు కూడా కరోనా టెస్టులు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. మృత దేహాలకు టెస్టులు చేయాల్సిన అవసరం లేదని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. మృతదేహాలకు పరీక్షలు చేయకపోతే త్వరలోనే మూడో స్టేజ్‌కు చేరుకునే ప్రమాదం ఉందని ధర్మాసనం ముందు వాదించారు. (కరోనా ఎఫెక్ట్: పది, ఇంటర్ పరీక్షలు రద్దు)
పలు రాష్ట్రాల్లో చనిపోయిన వైద్యులకు పరీక్షలు నిర్వహించిన తరువాతనే వైరస్ బయటపడిందని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. రాష్ట్రంలో కరోనా వైరస్‌పై ప్రభుత్వం సమర్పించిన నివేదిక పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వివిధ సంస్థలు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలను అనుసరిస్తోందో తమకు చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 26 వరకు దీనిపై పూర్తి నివేదిక అందించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. (దూరం 250 కిమీ.. టికెట్ ధర 12వేలు)
Comments
Please login to add a commentAdd a comment