
సాక్షి, హైదరాబాద్: రామకృష్ణ ముదిరాజ్ అనే యువకుడికి దివ్యాంగుల కోటాలో చాలినంత అర్హత లేనందునే టీఆర్టీకి ఎంపిక చేయలేదని టీఎస్‌పీఎస్‌సీ స్పష్టంచేసింది. వికారాబాద్ జిల్లా దోమ మండలం పోతిరెడ్డి పల్లికి చెందిన రామకృష్ణ టీఆర్టీ–2017లో ఉత్తీర్ణత చెందినప్పటికీ ఉద్యోగావకాశం రాలేదంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలపై స్పందిస్తూ టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి వాణీప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. టీఎస్‌పీఎస్‌సీపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, కమిషన్ కచ్చితంగా నియమ, నిబంధనలకు లోబడి వ్యవహరిస్తుందే తప్ప ఎవరి పట్ల వివక్ష చూపబోదని స్పష్టంచేశారు.
సరోజినీ కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌లో ఆయనకు వైకల్యం 30 శాతం మాత్రమే ఉన్నట్లు వెల్లడించిందని, కనీసం 40 శాతం ఉండాలన్న ప్రభుత్వ నిబంధన మేరకు ఆయనకు అవకాశం ఇవ్వలేదని తెలిపారు. రాత పరీక్షలో అతడికి 53.209 మార్కులు వచ్చినా కంటిచూపులో 40 శాతం కంటే తక్కువగా వైకల్యం (30 శాతమే ఉందని) ఉందని మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదిక మేరకు తిరస్కరించినట్లు వెల్లడించారు. అంతేతప్ప అర్హత ఉన్నా ఉద్యోగావకాశం కల్పించలేదన్న సదరు అభ్యర్థి ఆరోపణలో నిజం లేదన్నారు. ఈ విషయమై సదరు అభ్యర్థి కమిషన్ కార్యాలయాన్ని సంప్రదించినపుడు కూడా అక్కడున్న సిబ్బంది అతనికి అన్ని వాస్తవాలను వివరించారని, తనకు టీఎస్‌పీఎస్‌సీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లభించలేదని ఆ అభ్యర్థి పేర్కొనడంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment