
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. తక్షణమే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించేలా ఆదేశించాలంటూ పిటిషనర్ ఓయూ రీసెర్చ్ స్కాలర్ సురేంద్ర సింగ్ ఆదివారం ఈ పిల్ దాఖలు చేశారు. అలాగే కార్మికుల సమస్యలపై కమిటీ వేయాలని ఆయన తన వ్యాజ్యంలో కోరారు. ‘గతంలో ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని ఇప్పటికి అమలు చేయకపోవడంతో కార్మికులు సమ్మెకు దిగారు. ఇచ్చిన హామిని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి.
సమ్మె కారణంగా లక్షలమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సాయంత్రం నాలుగు గంటలకు హైకోర్టు న్యాయమూర్తి వాదనలు విననున్నారు. కుందన్‌బాగ్‌లోని జడ్జి నివాసంలో విచారణ జరగనుంది. పిటిషనర్ తరఫున న్యాయవాది కృష్ణయ్య వాదనలు వినిపించనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు ఆర్టీసీ సమ్మెపై సమీక్ష నిర్వహించనున్నారు.