సాక్షి, సిటీబ్యూరో: కాగిత రహిత డిజిటల్ సేవల్లో భాగంగా దక్షిణమధ్య రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్ సిస్టమ్ (యూటీఎస్) మొబైల్ యాప్‌నకు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. గత జూన్ నాటికి యూటీఎస్ వినియోగదారుల సంఖ్య గత జూన్ నాటికి 3.87 లక్షలకు చేరుకుంది. గత సంవత్సరం ఏప్రిల్ నాటికి 60 వేలు ఉన్న యూటీఎస్ వినియోగదారులు ఏడాది కాలంలోనే ఏకంగా 545 శాతం పెరిగినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనరల్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, ఎంఎంటీఎస్, తదితర సర్వీసుల కోసం టిక్కెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద క్యూల్లో పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని 2016లో ప్రయోగాత్మకంగా ఎంఎంటీఎస్ సర్వీసుల్లో అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడంతో గతే డాది జూలైలో దక్షిణమధ్య రైల్వే పరిధిలోని అన్ని సాధారణ రైళ్లకు, అన్‌రిజర్వ్‌డ్ బోగీలకు విస్తరించారు. నవంబర్ నుంచి దేశవ్యాప్తంగా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ యూటీఎస్ ద్వారా సబర్బన్, నాన్ సబర్బన్ రైళ్లతో పాటు ప్లాట్‌ఫామ్ టిక్కెట్‌లు కూడా తీసుకోవచ్చు. యూటీఎస్‌ను వినియోగిచుకొనేందుకు ప్రయాణి కులు తమ మొబైల్ ఫోన్‌లలో రైల్వే వాలెట్‌ను (ఆర్–వాలెట్)ను కలిగి ఉండాలి. ఈ వాలెట్ ద్వారా బుక్ చేసుకొనే అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్‌లపైన 5 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
విస్తృత ప్రచారం...
యూటీఎస్ పై ప్రయాణికుల్లో అవగాహన పెంచేందుకు దక్షిణమధ్య రైల్వే విస్తృత ప్రచారం చేపట్టింది. ప్రత్యేకించి ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో‘ లైన్‌లలో నిరీక్షించకుండా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు తీసుకొని ప్రయాణించాలంటూ’ ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూట్, తదితర సోషల్ మీడియా మాద్యమాల ద్వారా చేపట్టిన ప్రచారం సత్ఫలితాలను ఇచ్చింది. అదే సమయంలో కమర్షియల్ విభాగం సైతం అన్ని స్టేషన్‌లలో విస్తృత ప్రచారం కల్పించింది. యూటీఎస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరు ఈ మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవాలని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment