సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ పింఛన్ పంచ్ విసిరింది. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ఆ పార్టీ పంద్రాగస్టును పురస్కరించుకుని రాష్ట్రంలోని పింఛన్ దారులకు మరో కీలక హామీనిచ్చింది. అధికారంలోకి వస్తే సామాజిక పింఛన్ల సొమ్మును రెట్టింపు చేస్తా మని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న నెలకు రూ.1000 పింఛన్‌ను రూ.2 వేలకు పెంచుతామని వెల్లడించారు.
పింఛన్ పొందేందుకు ప్రస్తుతమున్న 65 ఏళ్ల వయసు అర్హతను 58 ఏళ్లకు కుదిస్తామని తెలిపారు. వికలాంగులకు రూ.1500 చొప్పున ఇస్తున్న పింఛన్‌ను నెలకు రూ.3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని తెలిపారు. ఈ మేరకు పార్టీ తరఫున ఆయన అధికారిక ప్రకటన చేశారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కమిటీ సిఫారసు చేసిన ప్రకారం పించన్ నగదును రెట్టింపు చేస్తున్నామని, 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పక్షాన రాష్ట్ర ప్రజలకు ఈ హామీలిస్తున్నట్టు చెప్పారు.
అధికార పార్టీ కంటే ముందే..
ఆరు నెలల ముందు ఎన్నికలు జరిగితే ముందస్తు కాదని, తాము సెప్టెంబర్‌లోనే పార్టీ అ«భ్యర్థులను ప్రకటిస్తామని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లినట్టు కనిపిస్తోంది. దీనిలో భాగంగానే అధికార పార్టీ కంటే ముందే టీపీసీసీ చీఫ్ పింఛన్‌దారులకు వరాలు ప్రకటించారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తాము అధికారంలోకి వస్తే పింఛన్‌దారులకు ఇస్తున్న నగదును రెట్టింపు చేస్తామని చెప్పిన ఉత్తమ్ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే ప్రజలకు హామీలిస్తున్నామని, ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని ప్రకటించడం గమనార్హం. సెప్టెంబర్ 2వ తేదీన టీఆర్‌ఎస్ నిర్వహించనున్న ప్రగతినివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకట్రెండు ఎన్నికల హామీలు ఇచ్చే అవకాశముందనే సమాచారం తమకుందని, అందుకే పింఛన్‌దారులకు ఇప్పుడే కాంగ్రెస్ తరఫున భరోసా ఇచ్చామని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment