సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సాధారణ ఎన్నికల తర్వాత సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం పార్టీ యంత్రాంగంలో కొత్త ఉత్సాహం నింపింది. సాధారణ ఎన్నికల తర్వాత వివిధ పార్టీల నుంచి ద్వితీయ, తృతీయశ్రేణి నాయకత్వం అధికార పార్టీలోకి వలస పోతున్నా వైఎస్సార్‌సీపీ కేడర్ చెక్కు చెదరలేదని సోమవారం జరిగిన సమావేశం నిరూపించింది.
నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున సమావేశానికి తరలిరావడం ద్వారా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురోగతికి అవకాశముందని ముఖ్య నేతలు అంచనాకు వచ్చారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వివిధ పార్టీలు తమపై మోపిన ‘బదనాం’ నుంచి బయట పడతామనే ధీమా పార్టీ శ్రేణుల్లో కనిపించింది. ‘సంక్షేమ కార్యక్రమాలకు చిరునామా దివంగత సీఎం వైఎస్. పింఛన్లు, రేషన్ కార్డుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటాన్ని చూస్తూ జనం వైఎస్‌ను గుర్తు చేసుకుంటున్నారు.
వైఎస్ హయాంలో లబ్ధిపొందిన అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపచేయటంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే అంశం రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుందని’ పార్టీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘కొత్త రాష్ట్రంలో అనేక సవాళ్లు వున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సహకరిస్తాం. అదే సమయంలో ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో ఉద్యమిస్తామని’ నేతలు దిగువస్థాయి కేడర్‌కు పార్టీ వైఖరిపై దిశా నిర్దేశం చేశారు.
వైఎస్సార్‌సీపీలో... నూతనోత్తేజం
Published Wed, Nov 19 2014 3:56 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement