రూ.5831 కోట్లతో వాటర్‌గ్రిడ్
పల్లెలు, పట్టణాలు, నగరాల్లో తాగునీటి సమస్య శాశ్వత నివారణకు ప్రభుత్వం తలపెట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి ప్రణాళిక సిద్ధమైంది. రూ.5,831 కోట్ల వ్యయంతో జిల్లాలో ఏడు గ్రిడ్‌ల ద్వారా ప్రతీ ఇంటికి నల్లానీరు అందించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. మన జిల్లాతోపాటు వరంగల్, నల్గొండ జిల్లాల్లోని పలు మండలాలను కలుపుకుని రూపొందించిన ఈ గ్రిడ్ సర్వే పనులు మొదలయ్యాయి.
కరీంనగర్ సిటీ/కోనరావుపేట : ముఖ్యమంత్రిగా తొలిసారి జిల్లాకు వచ్చిన కేసీఆర్, రాష్ట్రవ్యాప్తంగా వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. సెంటిమెంట్‌గా అచ్చొచ్చిన కరీంనగర్‌లో ఈ పథకాన్ని ప్రకటిస్తున్నానని, తన హయాంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పథకం ఇదేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటర్‌గ్రిడ్ పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. మొదటి ప్రాధాన్యతగా సిరిసిల్ల-వేములవాడ-చొప్పదండి గ్రిడ్‌ను ఎంచుకొన్నారు. ఈ గ్రిడ్‌కు సంబంధించిన సర్వే ప్రస్తుతం కొనసాగుతోంది. మరో 20 రోజుల్లో ఈ సర్వే పూర్తి చేసి, టెండర్ పిలిచే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ముందుగా ఈ గ్రిడ్ పరిధిలోని ప్రజలకు నీటిని అందజేయనున్నారు. ఒక్కో మండలంలో రెండు నుంచి మూడు బృందాలు సర్వే చేస్తున్నాయి. గ్రామంలో, ఇంటింటికీ పైప్‌లైన్, రిజర్వాయర్ స్టోరేజీ ప్రాంతాలను సర్వే చేస్తున్నారు. ముస్తాబాద్‌లో గురువారం హైదరాబాద్‌కు చెందిన పల్లవి సర్వేయర్స్ కంపెనీ ఇంజినీర్లు జీపీఎస్ ద్వారా శాటిలైట్ సర్వే చేపట్టారు. వేములవాడ మండలం తెట్టకుంట, మారుపాక శివారులోని 25 ఎకరాల ప్రభుత్వ భూమిని వాటర్‌గ్రిడ్ కోసం ఆర్డీవో భిక్షానాయక్ గురువారం పరిశీలించారు.
సర్వేకు రీ టెండర్
మిగతా ఆరు గ్రిడ్‌లకు సంబంధించిన సర్వే చేపట్టేందుకు రీటెండర్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకుముందు నిర్వహించిన టెండర్‌లో ఇద్దరు పాల్గొన్నా... వారికి అర్హత లేకపోవడంతో వాయిదా వేశారు. త్వరలోనే రీటెండర్ పిలిచి సర్వే పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
వనరుల ఎంపిక
వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా ఏడు గ్రిడ్‌లకు నీటిని అందించేందుకు వనరులను ఎంపిక చేశారు. జిల్లాలోని ఎస్సారెస్పీ, మధ్యమానేరు, ఎల్‌ఎండీ, ఎల్లంపల్లి, గోదావరి నుంచి నీటి సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కనిష్టంగా కరీంనగర్ గ్రిడ్ ఉండగా, హుస్నాబాద్, మానకొండూర్, పెద్దపల్లి, రామగుండం గ్రిడ్‌లు గరిష్టస్థాయిలో ఉన్నాయి. కోరుట్ల-జగిత్యాల నియోజకవర్గాలకు సంబంధించి ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేయనున్నారు. సిరిసిల్ల-వేములవాడ-చొప్పదండి నియోజకవర్గాలకు మధ్యమానేరు నుం చి, హుజూరాబాద్, కరీంనగర్‌లకు ఎల్‌ఎండీ నుంచి, పెద్దపల్లి, రామగుండం, ధర్మపురిలకు ఎల్లంపల్లి, కాళేశ్వరం గ్రిడ్‌కు గోదావరి నుంచి నీటిని సరఫరా చేయనున్నారు. ఈ పథకంలో మన జిల్లాతోపాటు వరంగల్, నల్గొండ జిల్లాల్లోని పలు మండలాలకు కూడా ఇక్కడినుంచే నీటిని అందించనున్నారు.
హుస్నాబాద్-మానకొండూరు గ్రిడ్‌లో జిల్లాలోని 8 మండలాల తోపాటు వరంగల్ జిల్లాలోని 10 మండలాలు, నల్గొండ జిల్లాలోని 3 మండలాలకు నీరందనుంది. హుజూరాబాద్ గ్రిడ్ నుంచి కూడా వరంగల్‌లోని ఐదు మండలాలకు నీటిని సరఫరా చే సేలా ప్రతిపాదనలు రూపొందించారు. మహదేవపూర్, మహాముత్తారం, కాటారం, మల్హర్ మండలాలకు కాళేశ్వరం గ్రిడ్ నుంచి నీరందించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
ఇంటింటికీ తాగునీరు
గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న నీటి వనరులతో కొన్ని దళితవాడలకు, గిరిజన తండాలకు సరిపడా నీరందడం లేదు. ఈ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి సుమారు 20 నుంచి 40 లీటర్ల నీరు మాత్రమే అందుతోందని ప్రభుత్వం అంచనా వేసింది. వాటర్‌గ్రిడ్ పథకం పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ మనిషికి 100 లీటర్లు అందించనున్నారు.
పట్టణ ప్రాంతాల్లోనూ నీటి ఇబ్బందులు ఎక్కువే ఉన్నాయి. మున్సిపాలిటీల్లో నిత్యం నీటి సరఫరా జరగాల్సి ఉన్నా ఎక్కడా చేయడం లేదు. రెండు మూడు రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. వాటర్‌గ్రిడ్‌తో ఇంటింటికీ నిత్యం తాగునీరందించాలని నిర్ణయించారు. పథకం పూర్తయితే పట్టణ ప్రాంతాల్లో ప్రతీ మనిషికి 135 లీటర్లు అందించనున్నారు.