
రేవంత్ విడుదల మరింత ఆలస్యం!
హైదరాబాద్ : 'ఓటుకు కోట్లు' కేసులో బెయిల్ మంజూరు అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విడుదలకు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. బెయిల్ ఆర్డర్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని, న్యాయమూర్తి తీర్పులో రూ.5 లక్షల చొప్పున పూచీకత్తును పోలీస్ స్టేషన్లో దాఖలు చేయాలని చెప్పడంతో ఇబ్బందులు ఏర్పడినట్లు తెలుస్తోంది. మరోసారి న్యాయమూర్తి ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించాలని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు భావిస్తున్నారు.
న్యాయమూర్తి తీర్పు కాపీలో మార్పులు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది. లేకుండా విడుదలకు మరింత సమయం పట్టవచ్చు. కాగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టు బెయిల్ తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.