చం‍ద్రబాబే ఏ-1 | Vote Note Case Chandrababu Naidu A1 | Sakshi
Sakshi News home page

చం‍ద్రబాబే ఏ-1

Published Tue, May 8 2018 1:08 AM | Last Updated on Sat, Jul 28 2018 3:49 PM

Vote Note Case Chandrababu Naidu A1 - Sakshi

సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఎట్టకేలకు ‘ఓటుకు కోట్లు’ కేసు కొలిక్కి రాబోతోంది! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ కేసులో ఏ–1 నిందితుడిగా అభియోగాలు ఎదుర్కోబోతున్నారు. శాసన మండలి ఎన్నికల్లో నామినేటెడ్‌ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసినట్లు రుజువైనందున ఈ కుట్రలో ఆయనే కీలకం అవుతారని న్యాయ నిపుణులు ఇప్పటికే తేల్చిచెప్పారు. కేసులో ఆయన్ను ఏ–1 నిందితుడిగా పేర్కొనాల్సి ఉంటుందని సోమవారం ప్రగతిభవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో పోలీసు అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తెచ్చారు.

‘‘చట్టం ముందు అందరూ సమానులే. చట్ట ప్రకారం వ్యవహరించండి. మీపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఓటుకు కోట్లు కేసును ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాదాపు రెండున్నర గంటలపాటు పోలీసు, న్యాయశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమీక్ష రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. మూడేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ కేసు మరోమారు తెరపైకి రావడంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. 

మూడేళ్ల నాటి కేసు
మూడేళ్ల క్రితం జరిగిన శాసనమండలి ఎన్నికల్లో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు లంచం ఇస్తూ నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం, అరెస్టు కావడం తెలిసిందే. స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇవ్వజూపడానికి ముందే చంద్రబాబునాయుడు ఆయనకు ఫోన్‌ చేసి టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రలోభాలకు గురిచేసిన ఆడియో అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ ఇప్పటికే రెండు చార్జిషీట్లను దాఖలు చేసింది.

ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏ–1 నిందితుడిగా పేర్కొన్న మొదటి చార్జిషీట్‌లో చంద్రబాబు పేరు 22 సార్లు ప్రస్తావనకు వచ్చింది. ఆ తర్వాత స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో రికార్డులో ఆ వాయిస్‌ చంద్రబాబుదా కాదా అని నిర్ధారించేందుకు ఏసీబీ చర్యలు చేపట్టింది. ఆడియో టేపులను చండీగఢ్‌ ఫోరెన్సిక్‌ విభాగానికి పంపింది. అది చంద్రబాబు వాయిసేనంటూ ఫోరెన్సిక్‌ విభాగం ఇటీవలే నివేదిక ఇచ్చింది. కారణమేంటో గానీ రెండున్నర సంవత్సరాలుగా ఈ కేసు ఏ మాత్రం ముందుకు సాగలేదు. 

చండీగఢ్‌ ఎఫ్‌ఎస్‌ఎల్‌ ధ్రువీకరణ 
స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఆడియోను ధ్రువీకరించుకునేందుకు ఏసీబీ చాకచక్యంగా వ్యవహరించింది. రాష్ట్రంలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి కాకుండా చండీగఢ్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో వాయిస్‌ను శాంపిల్‌ను పరీక్ష చేయించింది. అంతకుముందే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం బాబు ఆడియో శాంపిల్స్‌ను ఓ ప్రైవేట్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో పరీక్ష చేయించారు. అది చంద్రబాబు గొంతే అని స్పష్టంగా తేలడంతో ఆయన.. బాబుపై విచారణ జరపాలంటూ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తీరా ఇప్పుడు ఏసీబీ అధికారికంగా పరీక్షించిన వాయిస్‌ టెస్టులో అది చంద్రబాబు గొంతేనని మరోసారి అధికారికంగా ధ్రువీకరించడంతో కేసులో కదలిక వచ్చింది. ప్రఖ్యాతిగాంచిన చండీగఢ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నుంచి నాలుగు రోజుల క్రితం బాబు ఆడియో నివేదిక ఏసీబీ చేతికి అందింది. అన్ని ఆధారాలు లభ్యం కావడంతో రా>ష్ట్ర ప్రభుత్వం ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకు నాలుగు రోజులుగా లోలోపల కసరత్తు చేస్తోంది. 

కుట్ర మొత్తం బాబుదే.. 
ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ‘మన వాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ..’అంటూ సంభాషించింది చంద్రబాబు అని తేలడంతో ఓటుకు కోట్లు కేసులో కుట్ర మొత్తం చంద్రబాబుదిగానే ఏసీబీ చార్జిషీట్‌ రూపొందిస్తోంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణతో సెక్షన్లు చేర్చబోతోంది. ఇప్పటివరకు ఈ కేసులో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏ–1గా ఉండగా, సెబాస్టియన్‌ ఏ–2గా, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏ–3గా, ఉదయ్‌సింహ ఏ–4గా, జెరూసలెం మత్తయ్య ఏ–5గా ఉన్నారు. అయితే ఇప్పుడు కుట్ర మొత్తం చంద్రబాబుదే అని స్పష్టం కావడంతో ఏ–1గా ఆయన పేరు చేర్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు స్పష్టంచేశారు. ఆ తర్వాత మిగిలిన నిందితుల పేర్లను చేరుస్తామని అధికారులు తెలిపారు.  

2015 జూలై 28న తొలి చార్జిషీట్‌ 
ఓటుకు కోట్లు కేసులో ముందుగా అరెస్టయిన రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, సండ్ర, ఉదయ్‌సింహలను విచారించిన ఏసీబీ అధికారులు 2015 జూలై 28న మొదటి చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా ఆడియో, వీడియో శాంపిల్స్, స్టీఫెన్‌సన్, సెబాస్టియన్, రేవంత్, తదితరుల ఫోరెన్సిక్‌ రిపోర్టులను 2017 మార్చిలో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌లో పొందుపరిచారు. ఇప్పుడు బాబే అసలు నిందితుడని తేలడంతో ఏసీబీ ఈ నెల చివరి వారంలో తుది చార్జిషీట్‌ను దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. 

ఎవరి ఒత్తిడికీ లొంగవద్దు: కేసీఆర్‌ 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో ఓటుకు కోట్లు కేసు పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావు, ఏసీడీ మాజీ డీజీ ఏకే ఖాన్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌చంద్‌ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ కేసులో చట్టం తని పని తాను చేసుకుపోవాలని, ఆధారాలు బలంగా ఉన్నప్పుడు ఎవరి ఒత్తిడికి లొంగాల్సిన అవసరం లేదని, చార్జిషీట్‌ దాఖలు చేయాల్సిందేనని సీఎం అధికారులకు సూచించినట్టు తెలిసింది. దీంతో ఏసీబీ అధికారులు ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా రంగంలోకి దిగనున్నారని సీఎం కార్యాలయ వర్గాలు స్పష్టంచేశాయి. 

గవర్నర్‌ దృష్టికి.. 
ఆదివారం రాత్రి సీఎం కేసీఆర్‌.. గవర్నర్‌ నరసింహన్‌ భేటీలోనూ ఈ కేసు ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. గవర్నర్‌కు కేసు పురోగతిని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబుపై తీసుకోబోతున్న చర్యలను కేసీఆర్‌ వివరించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కావడంతో చార్జిషీట్, నిందితుల జాబితాలో చేర్చడం వంటి అంశాల్లో గవర్నర్‌ నుంచి అనుమతి కూడా రాష్ట్ర ప్రభుత్వం పొందినట్టు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో వచ్చే పదిహేను రోజుల్లో ఏసీబీ కోర్టులో పూర్తి స్థాయి చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు జీఏడీ నుంచి అనుమతి తీసుకున్నామని, గవర్నర్‌ నుంచి కూడా అనుమతి లభించినట్టు ఏసీబీలోని కీలక అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. 

బాబు వివాదాస్పద నిర్ణయాలపై పునఃసమీక్ష 
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఐఎంజీ అనే సంస్థకు రాజధాని హైదరాబాద్‌లో క్రీడా మైదానాలు అప్పగించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని కూడా తిరగదోడాలని, దానికి దారి తీసిన పరిస్థితులపై విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గచ్చిబౌలిలో దుబాయ్‌కి చెందిన ఎమ్మార్‌ సంస్థకు గోల్ఫ్‌ కోర్సు పేరిట దాదాపు 500 ఎకరాలు కట్టబెట్టిన వైనంపైనా విచారణ జరుపనుంది. ఎమ్మార్, రహేజాతో పాటు చంద్రబాబు హయాంలో సాగిన అన్ని భూ లావాదేవీల వెనుక గుట్టును రాబట్టాలని సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు హయాంలో భూ కేటాయింపులకు సంబంధించి అప్పటి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇచ్చిన నివేదికను పరిశీలించాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది.   

మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ..
సెబాస్టియన్‌ (బాబు అనుచరుడు): హలో 
స్టీఫెన్‌సన్‌: యా బ్రదర్‌.. 
సెబాస్టియన్‌: బాబు గారు గోయింగ్‌ టు టాక్‌ టూ యు, బి ఆన్‌ ద లైన్‌ (బాబు గారు మీతో మాట్లాడుతారు మీరు లైన్‌లో ఉండండి) 
స్టీఫెన్‌సన్‌: యా  
చంద్రబాబు: హలో.. 
స్టీఫెన్‌సన్‌: సర్‌ గుడ్‌ ఈవెనింగ్‌ సర్‌.. 
చంద్రబాబు: ఆ.. గుడ్‌ ఈవెనింగ్‌ బ్రదర్, హౌ ఆర్‌ యూ 
స్టీఫెన్‌సన్‌: ఫైన్‌.. థ్యాంక్యూ సర్‌ 
చంద్రబాబు: మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ.. ఐయామ్‌ విత్‌ యూ.. డోంట్‌ బాదర్‌ (మనవాళ్లు నాకు అంతా వివరించారు. మీకు అండగా నేనున్నాను. కంగారు పడాల్సిన పని లేదు) 
స్టీఫెన్‌సన్‌: యస్‌ సర్‌.. రైట్‌ సర్‌ 
చంద్రబాబు: ఫర్‌ ఎవ్రీ థింగ్‌ ఐ యాం విత్‌ యు, వాట్‌ ఆల్‌ దే స్పోక్‌ విల్‌ హానర్‌ (దేనికైనా మీకు నేను అండగా ఉంటాను. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తా) 
స్టీఫెన్‌సన్‌: ఎస్‌ సార్‌.. రైట్‌ సార్‌.. 
చంద్రబాబు: ఫ్రీలీ యూ కెన్‌ డిసైడ్‌.. నో ప్రాబ్లం ఎట్‌ ఆల్‌ (మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు.. ఎలాంటి సమస్యా లేదు) 
స్టీఫెన్‌సన్‌: ఎస్‌ సర్‌ 
చంద్రబాబు: దట్‌ ఈజ్‌ అవర్‌ కమిట్‌మెంట్‌ వుయ్‌ విల్‌ వర్క్‌ టుగెదర్‌ (అది మా హామీ.. మనం కలసి పని చేద్దాం)  
స్టీఫెన్‌సన్‌ : రైట్‌...థాంక్యూ సర్‌.. 
చంద్రబాబు: థాంక్యూ.

చంద్రబాబు–ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ మధ్య నడిచిన ఫోన్‌ సంభాషణ ఇదీ.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement