ఓటరు గుర్తింపు కార్డుకు 23 ఏళ్లు.. | Voter Card Have Been Completed 23 Years | Sakshi
Sakshi News home page

ఓటరు గుర్తింపు కార్డుకు 23 ఏళ్లు..

Published Mon, Nov 26 2018 2:53 PM | Last Updated on Mon, Nov 26 2018 3:12 PM

Voter Card Have Been Completed 23 Years  - Sakshi

సాక్షి, ఆర్మూర్‌: ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న భారత దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఎన్నికల కమిషన్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించింది. ఎన్నికలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు అనేక సంస్కరణలు తెచ్చింది. అందులో భాగంగా దొంగ ఓట్లను అరికట్టేందుకు ఓటరు గుర్తింపు కార్డులను అమలులోకి తెచ్చారు. ఓటరు గుర్తింపు కార్డులు అమలులోకి వచ్చి 23 సంవత్సరాలు గడుస్తోంది. 1995లో అప్పటి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ టీఎన్‌ శేషన్‌ ఓటరు నమోదు పారదర్శకంగా ఉండడంతో పాటు దొంగ ఓట్లను అరికట్టేందుకు ఓటరు గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టారు. అప్పట్లో ఈ నిర్ణయం సంచలనం కలిగించింది. ఓటరు జాబితాలో ఉన్న క్రమసంఖ్య ప్రకారం ఓటరు ఫొటోను కార్డుపై ముద్రించి ఇస్తున్నారు.

ఐడీ కార్డుపై పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, జనన తేదీ, కార్డు హోల్డర్‌ చిరునామా సైతం ముద్రిస్తారు. సీరియల్‌ నంబర్, హోలో గ్రామ్‌ స్టిక్కర్, కార్డును జారీ చేసిన అధికారి స్టాంపు, సంతకం కూడా ఉంటాయి. దీనిపై ముద్రించిన సీరియల్‌ నంబర్‌ చాలా ముఖ్యమైనవి అయినప్పటికీ ఇది ప్రతి సంవత్సరం మారుతుంది. ఎన్నికల కమిషన్‌ ద్వారా ఓటర్‌ లిస్టు డాటాను ఆన్‌లైన్‌లో ఉంచినప్పుడు ఓటరు తమ ఎన్నికల సంఖ్య, సీరియల్‌ నంబర్‌ను సులభంగా కనుక్కోవచ్చు. ఓటరు కార్డు ఉంటేనే ఓటు వేసే విధంగా నిబంధనలు విధించడంతో దొంగ ఓట్ల నివారణకు తోడ్పడుతోంది. భారతీయ పౌరసత్వం కలిగి 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందడంతో పాటు ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకొనే అవకాశాలను పలుమార్లు కల్పించారు. అప్పట్లో బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న ఓటరు గుర్తింపు కార్డులను ఇప్పుడు డిజిటల్‌ విధానంలో ఏటీఎం కార్డు సైజ్‌లో ఓటరు కార్డులను స్పష్టంగా ముద్రిస్తున్నారు.

 ఓటు హక్కుపై పూర్తి అవగాహన 

ఓటరు గుర్తింపు కార్డు అందుబాటులోకి వచ్చాక ప్రజలకు తమ ఓటు హక్కుపై పూర్తి అవగాహన వచ్చింది. ఓటరు జాబితాలో సైతం ప్రతీ ఓటరు ఫొటో ముద్రిస్తుండడంతో మరింత పారదర్శకత పెరిగింది. ఓటరు గుర్తింపు కార్డు అన్నది ప్రతి ఓటరుకు అందుబాటులోకి వచ్చింది. ఓటరు గుర్తింపు కార్డుతో పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ఓటరును పోలింగ్‌ ఏజెంట్లు సులువుగా జాబితాలో గల పేరును సరిచూసుకొని ఓటు వేయడానికి ఎన్నికల అధికారులు అవకాశాన్ని కల్పిస్తున్నారు. అయితే ఓటర్‌ గుర్తింపు కార్డులు అందుబాటులో లేని వారు పోల్‌ చీటీలో పొందు పరిచిన తమ ఓటు క్రమ సంఖ్య వివరాలతో కూడా ఓటు వేయడానికి అవకాశం కల్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement