
నల్లగొండ : పంచాయతీ పాలకవర్గాల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ సన్నద్ధమవుతోంది. జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయతీల ప్రకారం ముందుగా ఓటరు జాబితా రూపొందించే పనిలో ఆ శాఖ అధికారులు తలమునకలయ్యారు. ఓటరు జాబితా ఏవిధంగా తయారు చేయాలనే విషయంపై ఇప్పటికే ఎంపీడీఓలకు శిక్షణ ఇచ్చారు. వివిధ మండలాల్లో అవుట్ సోర్సింగ్ కింద కంప్యూటర్ ఆపరేటర్లను కూడా నియమించుకోవాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీ ఓటరు జాబితా గతంలో మాదిరి కాకుండా ఎన్నికల కమిషన్ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించింది. ‘టీ– పోల్’ అనే వెబ్‌సైట్‌లో ఓటరు జాబితా రూపొందిస్తారు. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన అసెంబ్లీ ఓటరు జాబితా ప్రకారం పంచాయతీ ఓటరు జాబితా తయారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది.
ఆవాస ప్రాంతాల వారీగా..
పాత పంచాయతీల నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన పంచాయతీల పరిధిలోని ఆవాస ప్రాంతాల వారీగా ఓటరు జాబితా తయారు చేస్తున్నారు. జిల్లాలో పాత పంచా యతీలు 502 ఉండగా కొత్తగా 349 పంచాయతీలు ఏర్పడ్డాయి. దీంతో కొత్తగా ఏర్పడిన పంచాయతీల పరిధిలోని ఆవాస ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని ఓటరు జాబితా తయారు చేయడం జరుగుతుంది. విడిపోయిన పంచాయతీ ఓటరు లిస్టులో ఏ సీరియల్ నంబరు కట్ అయిందో చూసుకుని దాని ప్రకారం కొత్తగా ఏర్పడిన ఆవాస ప్రాంతంలో చేరుస్తారు. పాత పంచాయతీలో ఉన్న ఓటరు, కొత్తగా ఏర్పడిన పంచాయతీలోకి రాకుండా జాగ్రత్త వహించాలి. కొత్త, పాత పంచాయతీలో రెండు చోట్ల ఓటరు పేరు కనిపించకుండా ఆ వ్యక్తి ఏ ఆవాస ప్రాంతంలోకి వెళ్లాడో చూసుకుని ఓటరు జాబితా తయారు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
కొత్త పంచాయతీలకు సర్వే నంబర్లు
కొత్తగా ఏర్పడిన పంచాయతీలకు సర్వే నంబర్లు కూడా ఇచ్చారు. వీటి ద్వారా పంచాయతీల భౌగోళిక స్వ రూపం కూడా తెలుస్తుంది. దీంతో ఓటరు ఏ ఆవాస ప్రాంతం పరిధిలోకి వస్తాడో స్పష్టంగా తెలుస్తుందని అ ధికా రులు చెప్పారు. కొత్త ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా పోలింగ్ స్టేషన్‌లు, వార్డుల సంఖ్యకూడా పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈసారి నిర్వహించే ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చే పోల్‌చిట్టీలు కూడా ఆన్‌లైన్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునేలా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఓటరు పేరుతో కలిగిన పోల్‌చిట్టీలను ఎంపీడీఓల లాగిన్ నుంచి ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునేలా సాఫ్ట్‌వేర్ రూపొందించినట్లు అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment