నల్లగొండ, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అభ్యర్థులను ఇంకా టెన్షన్‌కు గురిచేస్తూనే ఉన్నాయి. మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు ముగియగా.. ఏప్రిల్ 2వ తేదీన వాటి లెక్కింపు జరగాల్సి ఉంది. కానీ పలు రాజకీయ పార్టీలు ఫలితాలు నిలిపేయాలంటూ హైకోర్టును ఆశ్రయించాయి.
దీంతో ఆ ఫలితాలు కాస్తా ఈ నెల 9వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈ వ్యవధి కూడా సరిపోదని, ఆ ఫలితాలు వెల్లడిస్తే ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని పార్టీలు మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో సుప్రీంకోర్డు కూడా సార్వత్రిక ఎన్నికల తర్వాతే ఫలితాలు వెల్లడించాలని తీర్పు వెలువరించింది. ఇదే తీర్పు ప్రాదేశిక ఫలితాలు కూడా వర్తింపచేశారు. దీంతో అభ్యర్థులు ఏం చేయాలో పాలుపోక నిర్వేదంలో పడ్డారు. ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో వారి దృష్టంతా ప్రస్తుతం మున్సిపల్, ప్రాదేశిక ఫలితాలపై పడింది. ఈ నెల 12న మన్సిపల్, 13న ప్రాదేశిక ఎన్నికల లెక్కింపు వరుసగా జరుగుతాయి. దీంతో ప్రస్తుతం అభ్యర్థులు అంతా గెలుపోటములపై తలమునకలయ్యారు.
జిల్లా కేంద్రంలో మున్సిపల్... డివిజన్ కేంద్రాల్లో ప్రాదేశికం ఓట్ల లెక్కింపు
జిల్లాలో ఐదు మున్సిపాటీలు, రెండు నగర పం చాయతీల్లో కలిపి మొత్తం 210 వార్డులు ఉన్నాయి. ఒక్కో వార్డుకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 1311 మంది కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీచేశారు. అదే విధంగా ప్రాదేశిక ఎన్నికల్లో 59 జెడ్పీటీసీ స్థానాలకు 392మంది, 835 ఎంపీటీసీ స్థానాలకు 3,311 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత చాలా వ్యవధి ఉండడంతో మున్సిపల్‌కు సంబంధించిన ఈవీఎం మిషన్లను జిల్లా కేంద్రానికి, ప్రాదేశిక ఎన్నికల బ్యాలెట్ బాక్సులను డివిజన్ కేంద్రాలకు తరలించారు. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందు నియోజకవర్గ కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు చేయాలని భావించారు. ఆ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు కూడా చేసింది. కానీ చివరి నిమిషంలో చోటుచేసుకున్న పరిణామాల వల్ల ఓట్ల లెక్కింపు ప్రదేశాలను మార్చాల్సి వచ్చింది. దీంతో ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నల్లగొండలోనే నిర్వహించాలని నిర్ణయించారు. అదే విధంగా ప్రాదేశిక ఓట్ల లెక్కింపు కూడా రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దూర భారంపై ఆందోళన...
ఎన్నికల ఫలితాలు వాయిదా వేయడంతో నైరాశ్యానికి లోనైన అభ్యర్థులకు ఓట్ల లెక్కింపు ప్రదేశాలను కూడా మార్చడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఫలితాలను ఏకంగా జిల్లా కేంద్రానికి మార్చడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా దేవరకొండ, భువనగిరి, కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాలంటే సుమారు మూడు నుంచి నాలుగు గంటల ప్రయాణం చేయాల్సి వస్తుంది. అదీగాక ఓట్ల లెక్కింపు రోజు అభ్యర్థులతోపాటు, వారి అనుచరులు, బంధువులు, స్నేహితులు ఇలా వందల సంఖ్యల్లో జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. మున్సిపల్ కంటే కూడా భారీ సంఖ్యలో ప్రాదేశిక ఫలితాలకు ప్రజలు హాజరవుతారు. కొన్ని ప్రాంతాలు రెవెన్యూ డివిజన్లకు దూరంగా ఉన్నాయి. ప్రాదేశిక ఓట్ల లెక్కింపు సందర్భంగా అభ్యర్థులు ఇటు ఖర్చులు..అటు మానసిక ఒత్తిడి ఇలా అన్ని రకాల ఇబ్బందులకు గురికావాల్సిందే.
జిల్లా కేంద్రంలో అరకొర వసతులు...
నల్లగొండ శివారు ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో ఈవీఎంలు, బ్యాలెట్ బాక్సులను భద్రపర్చారు. ఓట్ల లెక్కింపు కూడా అక్కడే జరుగుతుంది కాబట్టి జిల్లా కేంద్రానికి ఆయా పార్టీల ముఖ్య నేతలు, ప్రజలు, అభ్యర్థులు, స్వతంత్రులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. మంచినీరు, ఆహారం, వసతి తదితర ఎలాంటి సౌకర్యాలకైనా అవస్థలకు గురికాక తప్పదు. వేసవి కాలం కావడంతో దూరప్రాంతాన ఉన్న జిల్లా కేంద్రానికి వె ళ్లడం ఒక పరీక్ష అయితే..అక్కడ ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు వేచిచూడడం మరొక పరీక్ష.
సంబరాలకూ దూరమే...
జిల్లా కేంద్రం, డివిజన్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపుతో సంబరాలు చేసుకునే పరిస్థితి లేకుండా పోతుంది. గెలిచిన అభ్యర్థులు, ఆత్మీయులు, స్నేహితులు, బంధువులతో సంబరాలు జరుపుకోవాలనే ఆశతో ఉంటారు. కానీ సుదూర ప్రాంతం నుంచి నల్లగొండకు చేరుకోవాలంటే దూరభారం ఎక్కువగా ఉంది. గెలిచిన వారు ఇక్కడినుంచి సొంత ప్రాంతాలకు వెళ్లేసరికి రాత్రి అవుతుంది. దీంతో సంబరాల సంతోషం ఆవిరయ్యేలా కనిపిస్తోంది.
ఆలస్యం.. ఆ పై దూరం
Published Wed, May 7 2014 3:24 AM | Last Updated on Wed, Sep 5 2018 3:24 PM
Advertisement
Advertisement