
పుల్‌కల్: సింగూరు ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్థాయికి చేరింది. సోమవారం ఉదయం వరకు ఎగువ ప్రాంతం నుంచి 2,966 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు డిప్యూటీ ఇంజనీర్ బాలగణేష్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా సాంకేతిక కారణాలతో 29 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు.
సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు 28.966 టీఎంసీల నీటి మట్టం ఉంది. 523.600 మీటర్లకుగాను 523.435 మీటర్లకు చేరింది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటిని మంగళవారం నుంచి దిగువకు విడుదల చేస్తామని బాలగణేష్ తెలిపారు. ఏ సమయంలోనైనా దిగువకు నీటిని వదిలే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే దండోరా వేయించినట్లు వివరించారు.