ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం
- మాదిగల శక్తి ప్రదర్శన సభలో కడియం శ్రీహరి
- వెంకయ్యను అంబేడ్కర్‌తో పోల్చడం బాధించిందని వ్యాఖ్య
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ‘మాదిగల శక్తి ప్రదర్శన బహిరంగ సభ’ జరిగింది. ఇందులో కడియం శ్రీహరి పాల్గొని ప్రసంగించారు. ఎస్సీ వర్గీకరణ కోసం పాటుపడే వారంతా తమకు మిత్రులేనన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో షెడ్యూల్డ్ కులాల మధ్య చీలిక వచ్చిందని, దీనిని అవకాశంగా వాడుకునేందుకు అగ్రవర్ణాలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. అలాంటి అవకాశం ఇవ్వకుండా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని.. త్వరలో జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి, కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని తెలిపారు.
బీజేపీ, టీడీపీలు కలసి రావాలి..
ఇటీవల ఢిల్లీలోని ఒక సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడినందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును అంబేడ్కర్‌తో పోల్చారని, అది తీవ్రంగా బాధించిందని కడియం చెప్పారు. దయచేసి అంబేడ్కర్‌తో ఎవరినీ పోల్చవద్దన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసిందని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా తీర్మానించాలని కోరారు. బీజేపీ, టీడీపీలు అనుకుంటే వర్గీకరణ సాధ్యమవుతుందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలంతా ఏకమై పోరాడాలని మాజీ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య సూచించారు. మంద కృష్ణ మాదిగ జాతిని అమ్ముకున్నాడని మాదిగ జేఏసీ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉందని నమ్మకం వ్యక్తం చేసిన వ్యక్తి.. ధర్మ యుద్ధ మహాసభ ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కార్మికుల జేఏసీ చైర్మన్ ఉప్పర్తి యాదయ్య, మేడి రమేశ్, జీఎస్‌ఎస్ సురేష్, తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇటుక రాజు, మాదిగ మహిళా జాతీయ అధ్యక్షురాలు జీవ మాదిగ, జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.