'నేనూ రైతు బిడ్డనే..రుణమాఫీని అమలుచేస్తాం'
రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దని ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్క్షప్తి చేశారు
మెదక్: రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దని ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్క్షప్తి చేశారు. దసరా పండగ నుంచి సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయని మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక నేపథ్యంలో నర్సాపూర్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కేసీఆర్ అన్నారు.
నేనూ రైతు బిడ్డనే..నాకు వ్యవసాయం ఉంది. రుణమాఫీని అమలుచేసి తీరుతాం అని కేసీఆర్ మరోసారి హామీ ఇచ్చారు. రిజర్వు బ్యాంక్ మూడు జిల్లాల్లో మాత్రమే రుణమాఫీకి అనుమతిచ్చిందని, అయితే దశలవారీగా మిగతా జిల్లాల్లో కూడా అమలుచేస్తామని ఆయన తెలిపారు. పేదల గురించి ఆలోచించే చరిత్ర కాంగ్రెస్‌కు లేదని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పిచ్చిమాటలు మానుకోవాలని కేసీఆర్ హితవు పలికారు.
ఇందిరమ్మ ఇళ్ల దొంగల ఆట కట్టిస్తామని, దళితులకు మూడెకరాల భూపంపిణీ కొనసాగిస్తామన్నారు. మూడేళ్ల తర్వాత తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని మరోసారి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజాసేవలో తన జీవితాన్ని దారబోస్తానని ఆయన అన్నారు. నాకంటే ఎక్కువ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపించాలన్నారు. తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డికి ఓటు ఎలావేస్తారని, తెలంగాణ సర్వేలో పాల్గొన్నట్లుగా ఓటింగ్‌లో పాల్గొనాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.