బెజ్జూర్ : టీఆర్‌ఎస్ సర్కార్ రైతు ప్రభుత్వమని, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత తమ సర్కారుదేనని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. బెజ్జూర్ మండల పరిషత్ కార్యాలయం, అర్కగూడ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. పంటల రుణమాఫీ అమలు చేసి మాట నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. బ్యాంకులు రుణం ఇవ్వకుంటే తమకు ఫోన్ చేయాలని రైతులకు సూచించారు.
ఈ నెల మొదటి వారంలో కురిసిన వర్షాలతో పంటలకు తీవ్రనష్టం వాటిల్లిందని తెలిపారు. 53 రోడ్లు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయని చెప్పారు. నష్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫొటోలతో సహా వివరించామని, స్పందించిన ఆయన ఐదేళ్ల కాలంలో సిర్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామన్నారని తెలిపారు. డూప్లికేట్ పట్టా పాస్‌పుస్తకాలపై రుణం పొందినవారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం నుంచి అధికారులు పంటనష్టం సర్వే చేస్తారని, జాబితాను గ్రామ పంచాయతీలో ప్రదర్శనకు పెడతారని తెలిపారు. రోడ్డు మరమ్మతుల కోసం రూ.7 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారని, ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.20 లక్షలు విడుదల చేస్తామని చెప్పారు. రెండు రోజుల్లో తునికాకు రాయల్టీ డబ్బులు కూలీలకు అందుతాయన్నారు. ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేశామని చెప్పారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.
ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఐటీడీఏ ద్వారా రోడ్లు బాగు చేస్తామన్నారు. ఎమ్మెల్యే కోనేరు కొనప్ప మాట్లాడుతూ వరదలతో ఏటా నాగుల్వాయి,లోడ్‌పెల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి పునరావాసం కల్పించాలని కోరారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం పెంచాలన్నారు. అంతకుముందు బారెగూ డ వంతెన, దెబ్బతిన్న రోడ్లు, పంటలను మంత్రి పరిశీలించారు. బెజ్జూర్‌లో ఫొటో ప్రదర్శనను తిలకించారు.
నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ రాజి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, టీఆర్‌ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీశ్, పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఏపీఆర్వో భీమ్‌కుమార్, ఎంపీడీవో చంద్రకళ, ఎంపీపీ సిర్పూరం మంజుల, జెడ్పీటీసీ శారద, ఉట్సారంగపెల్లి సర్పంచ్ విశ్వేశ్వర్, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మాది రైతు ప్రభుత్వం
Published Thu, Sep 25 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM
Advertisement
Advertisement