
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు ఎమ్మెల్యేల బహిష్కరణ వేటును కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇప్పటికైనా స్వాగతించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇంకా ఈ విషయంలో నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తే ప్రభుత్వం ప్రజల్లో చులకన అవుతుందని ఆ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని అన్నారు.
ప్రజలు వాతలు పెడతారు: శ్రవణ్
హైకోర్టు తీర్పును కూడా లెక్కచేయకుండా ఇద్దరు ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి అడుగుపెట్టనీయమని అంటున్న టీఆర్‌ఎస్‌కు ప్రజలు కర్రు కాల్చి వాతలు పెడతారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పడం సర్కారు దివాళాకోరు విధానానికి నిదర్శనమని ఆయన అన్నారు.