సీనియారిటీ.. విధేయత.. బీసీ!
రఘువీరాకు పీసీసీ పీఠం వెనుక కారణాలివే
చిరంజీవి సీమాంధ్ర ప్రచార కమిటీకే పరిమితం.. ఆయన వర్గం అసంతృప్తి
చక్రం తిప్పిన కేవీపీ బృందం...
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష స్థానానికి ఉన్నట్టుండి నీలకంఠాపురం ర ఘువీరారెడ్డి పేరు తెరపైకి రావటం వెనుక కారణాలేమిటి? నిన్న మొన్నటివరకు పీసీసీ రేసులో ఉన్న బడా నేతలకు బదులు అనూహ్యంగా రఘువీరారెడ్డిని ఎంపిక చేయడం వెనుక కాంగ్రెస్ వ్యూహమేమిటి? అన్నది ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తున్నామని ప్రజల్లోకి సంకేతాలు పంపటానికే ఈ ఎంపికలు జరిగినట్లు చెప్తున్నారు. ఇంతకుముందు సీమాంధ్రలో పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి చిరంజీవి, కన్నా లక్ష్మీనారాయణ, బొత్స సత్యనారాయణ, చివర్లో రఘువీరా పేర్లపై ప్రచారం జరిగింది. చివరికి, పార్టీలో సీనియర్, అధిష్టానం పట్ల అత్యంత విధేయతను ప్రకటించిన వెనుకబడినవర్గానికి చెందిన రఘువీరారెడ్డి పేరును అధిష్టానం పరిశీలనకు తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో అనాదిగా పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వర్గాలన్నీ దూరం కావడం కూడా రఘువీరా ఎంపికకు దారితీసినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు అండగా ఉండే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ తదితర వర్గాలు ఇంతకుముందే దూరమయ్యాయి. రాష్ట్ర విభజన కారణంతో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో రఘువీరాకు పార్టీ పగ్గాలు అప్పగించేలా రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు బృందం కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కాగా చిరంజీవికి కేవలం రాష్ట్రంలో పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగిస్తూ ఆ కమిటీకి చైర్మన్‌గా నియమించడం ఆయన సన్నిహిత వర్గాల్లో అసంతృప్తికి దారితీస్తోంది.
బొత్స తప్పుకున్నారా? తప్పించారా?: పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికలు పూర్తయ్యేవరకు కొనసాగుతానని భావించిన బొత్స సత్యనారాయణ అంతకుముందుగానే పదవి నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. తన సొంత జిల్లాపై దృష్టి సారించాల్సిన అవసరముందని, రాష్ట్రమంతటినీ పర్యవే క్షించడం కష్టమవుతుందని, తనను తప్పించాలని పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి బొత్స విన్నవించారని బయటకు ప్రచారం జరిగింది. అయితే.. బొత్స పనితీరుపై పార్టీ అధిష్టానం గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉందని, పార్టీయే ఆయన్ను తప్పించిందని ఆయన వ్యతిరేక వర్గం చెప్తోంది. గత కొంత కాలంగా సోనియా.. బొత్సకు అపాయింట్‌మెంటుకూడా ఇవ్వడం లేదని గుర్తుచేస్తున్నారు.
కష్ట కాలంలో సమర్థంగా నడిపిస్తా: రఘువీరా
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (సీమాంధ్ర) అధ్యక్షుడిగా ఎన్.రఘువీరారెడ్డిని నియమించినట్లు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా ఆయనకు ఫోన్ చేసి తెలియజేశారు. మునిసిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులను సన్నద్ధం చేయటంలో భాగంగా రఘువీరా అనంతపురంలో మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమయంలోనే సోనియాగాంధీ.. రఘువీరాకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా నడిపిస్తానని రఘువీరా విలేకరుల సమావేశంలో చెప్పారు. పదవులు అనుభవించిన నేతలు కష్టకాలంలో కాంగ్రెస్‌ను వదిలి పెట్టడం దారుణమని విమర్శించారు.
విద్యార్థి సంఘాల నుంచి పీసీసీ చీఫ్ వరకూ...
అనంతపురం జిల్లాలో వెనుకబడిన మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురంలో 1957 ఫిబ్రవరి 12న ఎన్.రఘువీరారెడ్డి జన్మించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఏబీవీపీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పటి జన్‌సంఘ్ పార్టీలో పనిచేశారు. 1988లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. 1989 ఎన్నికల్లో మడకశిర నియోజకవర్గం నుంచి పోటీచేసి తొలిసారే విజయం సాధించారు. మొత్తం నాలుగుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. పలు మంత్రి పదువులు చేపట్టారు. అనంతపురం జిల్లా నుంచి పీసీసీ చీఫ్‌గా నియమితులైన రెండో నేత రఘువీరా. గతంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పీసీసీ చీఫ్‌గా, ఏఐఐసీ చీఫ్‌గా పనిచేశారు.