కౌన్ బనేగా మంత్రి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : తెలంగాణ మంత్రివర్గంలో జిల్లాకు రెండు బెర్త్‌లు లభించే అవకాశం కనిపిస్తోంది. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కొలువుదీరే ప్రభుత్వంలో జిల్లా నుంచి ఇద్దరిని కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ తర్వాత అత్యధిక సీట్లు కలిగిఉన్న రంగారెడ్డి జిల్లాకు ప్రతి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ర్టంలోను జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాలని టీఆర్‌ఎస్ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ఇదివరకే కేసీఆర్ ప్రకటించారు. కరీంనగర్ నుంచి శాసనమండలి సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న స్వామిగౌడ్‌కు రంగారెడ్డి జిల్లా కోటా కింద కార్మిక శాఖను కట్టబెడుతున్నట్లు పార్టీవర్గాలు చె బుతున్నాయి. దీంతో ఇప్పటికే ఒక మంత్రి పదవి దాదాపు ఖాయం కావడంతో మరో పదవిపై తాండూరు ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి గంపెడాశ పెట్టుకున్నారు. జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలుపొందినా... మిగతా ముగ్గురు తొలిసారి శాసనసభకు ఎన్నికైనవారు కావడంతో తనకు ఛాన్స్ తథ్యమనే ఆశాభావంతో ఉన్నారు.
మినిస్టర్ కావాలనే చిరకాల వాంఛ ఈ సారి నెరవేరుతుందనే భరోసాతో ఉన్న మహేందర్... ఇప్పటికే పార్టీ శ్రేణులకు కూడా ఇదే రకమైన సంకేతాలిచ్చారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించినా.. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రియోగం పట్టలేదు. తనకంటే సీనియర్లు ఆ పార్టీలో ఉండడంతో బెర్త్ ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ గ్రాఫ్ పడిపోవడం, ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం కనుచూపుమేరలో కనిపించకపోవడంతో ఎన్నికలకు ముందు గులాబీ గూటికి చేరారు. సీనియర్ ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి, కేఎస్ రత్నం అనూహ్యంగా ఓటమిపాలు కావడం మహేందర్‌కు సానుకూలంగా మారింది. గెలిచిన ఎమ్మెల్యేలంతా కొత్తవారు కావడంతో తనకు లైన్‌క్లియరైందని భావిస్తున్నారు.
మరోవైపు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోయినప్పటికీ, భవిష్యత్ అవసరాల దృష్ట్యా మహేందర్‌ను మంత్రివర్గం లోకి తీసుకునే అంశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలి సింది. కేబినెట్‌లోకి తీసుకోకూడదని సొంత పార్టీలోని వైరివర్గం అధిష్టానంపై ఒత్తిడి పెంచినా, జిల్లా ప్రాధాన్యం దృష్ట్యా మహేందర్‌కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గనులు, భూగర్భ వనరులు, పశు సంవర్థక శాఖ మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణలు పరిగణనలోకి తీసుకుంటున్న కేసీఆర్.. మిగతా ఎమ్మెల్యేల సమర్థతను కూడా బేరీజు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే వికారాబాద్ రిజర్వ్ స్థానం నుంచి గెలిచిన బి.సంజీవరావు పేరును కూడా గులాబీ అధిష్టానం పరి శీలిస్తోంది. మంత్రి ప్రసాద్‌కుమార్‌పై గెలుపొందిన సంజీవరావు విద్యావంతుడు, మృదుస్వభావి కావడంతో ఈయనను కేబినెట్‌లోకి తీసుకోవాలని ఒకవర్గం లాబీయింగ్ చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి కూడా ఈయన పేరును సిఫార్సు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్నికల వేళ పార్టీలో చేరినవారికి మంత్రి పదవులు ఇవ్వకూడదని టీఆర్‌ఎస్ నాయకత్వం స్పష్టం చేస్తున్నందున ఆ షరతు తనకు ప్లస్‌పాయింట్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలోనే రెండో అతిపెద్ద మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏదీ ఎమైనా మరో 24 గంటల్లో మంత్రి పదవులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది.