బాల్యవివాహాలను ఆపేదెవరు? | Who should Stop Child Marriages | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాలను ఆపేదెవరు?

Published Sun, Dec 16 2018 10:59 AM | Last Updated on Sun, Dec 16 2018 10:59 AM

Who should Stop Child Marriages - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మంచిర్యాల క్రైం: ఆర్థిక అసమానతలు... నిరక్షరాస్యత... బాలికలను జాగ్రత్తగా పెంచలేమన్న అభద్రతా భావం... ¿¶భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న బెంగ.. జిల్లాలో బాల్య వివాçహాలు పెరిగేందుకు దోహదపడుతున్నాయి. చట్టాలు ఎన్ని చేసినా ఆ వివాహాలు ఆగడంలేదు. అధికారుల దృష్టికి 10 శాతం మాత్రమే వస్తుండగా.. 90శాతం వివాహాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగి పోతున్నాయి. జిల్లా శిశు సంక్షేమశాఖ పరిధిలోని ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌(ఐసీపీఎస్‌) అధికారులు ఆపిన వివాహాలు అతి తక్కువగానే ఉన్నాయి.

2014 నుంచి 2018 డిసెంబర్‌ 15వరకు జిల్లాలో 48 బాల్యవివాహాలను నిలిపి వేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరి లెక్కలోకి రాని వివాహాలు అనేకం ఉంటున్నాయి. బాల్యవివాహాలు నిరోధించే చట్టం బ్రిటిష్‌ కాలంలో 1929 నుంచి అమలులో ఉంది.  ఈ చట్టంలో అనేక మార్పులు చేసిన కేంద్రం బాల్య వివాహాల నిరోధక చట్టం 2006ను రూపొందించింది. ఈచట్టంపై ప్రజలకు అవగాహన లేకపోవడంతోనే బాల్యవివాహాలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. వివాహానికి బాలికలకు 18 ఏళ్లు, బాలురకు  21ఏళ్లుగా ఈ చట్టంలో నిర్ధారించారు.  మరి ఈ చట్టం ఏంచెబుతుంతో తెలుసుకుందాం.. 

నేరస్తుల విచారణలో ... 
21 సంవత్సరాల వయస్సు కన్నా తక్కువ ఉన్న వ్యక్తి, 18 సంవత్సరాల కన్నా తక్కువ కలిగిన బాలికను వివాహం చేసుకుంటే ఆవ్యక్తి శిక్షార్హుడని చట్టం పేర్కొంటుంది. బాల్యవివాహాలు నిర్వహించడం, ప్రోత్సహించడం వంటి పనులు చేస్తున్న వారిలో తల్లిదండ్రులు, సంరక్షకులు, ఇతర వ్యక్తులు, సంస్థలు ఎవరైనా సరే ఈ చట్టంలో శిక్షార్హులుగా నిర్ధేశించారు. ఈ తరహా నేరాలకు పాల్పడిన వారిలో మహిళలుంటే మాత్రం వారికి జైలుశిక్ష విధించాలని ఈ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. 

బాల్య వివాహం నేరం – శిక్ష 
- బాల్య వివాహాలను ప్రోత్సహించేవారు కఠిన కారాగార శిక్షకు అర్హులు. ఈ నేరానికి రెండేళ్ల జైలుశిక్ష లేదా రూ.లక్ష వరకు జరిమానా లేదా రెండూ వి«ధించవచ్చు.  
- బాల్య వివాహం తర్వాత ఆ మైనరు అక్రమ రవాణా చేయడానికి, ఆమెను దాచేందుకు  ప్రయత్నించడం చట్టరీత్యా నేరం. 
- బాల్య వివాహాలను నిషేధిస్తూ న్యాయస్థానాలు ఉత్తర్వులు జారీ చేయవచ్చు.  
- చట్టాన్ని, మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులను ఉల్లంఘించి బాల్యవివాహాన్ని ఏ మత సాంప్రదాయాలతో జరిపినా ఆ వివాహం చెల్లదు.  
- ఈ చట్టం కింద నమోదయ్యే కేసులో వారెంట్‌ లేదా మేజిస్ట్రేట్‌ అనుమతి లేకుండానే  పోలీసులు బాల్య వివాహాన్ని ఆపవచ్చు. 
- ఈ చట్టం కింద నేరస్తులకు శిక్షతో కూడిన లేదా బెయిలుకు వీలులేని శిక్ష విధిస్తారు.  

ఈ చట్టం కింద శిక్షార్హులయ్యే వ్యక్తులు 
- ఇరుపక్షాల తల్లిదండ్రులు, సంరక్షకులు, పురోహితులు 
- ఇరుపక్షాల ఇరుగు పొరుగు వారు 
- ఈ వివాహానికి హాజరైన ప్రభుత్వ ఉద్యోగులు  

సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా.... 
జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్టు తెలిస్తే జిల్లా కలెక్టర్, పోలీస్,  ఉన్నాతాధికారులు (ఫోన్‌ నంబర్‌100)మహిళా శిశు సంక్షేమ శాఖ పథకం సంచాలకులు, ఐసీపీఎస్,  చైల్డ్‌ లైన్‌ (ఫోన్‌ నంబర్‌1098) తహసీల్దార్, సీడీపీవో, గ్రామస్థాయిలో అయితే వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులకు వెంటనే తెలియజేయవచ్చు. అవసరమైతే సామాజిక సేవ కార్యకర్తలకు కూడా సమాచారం అందించవచ్చు. సమాచారం అందించిన  వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి. 

బాల్య వివాహంతో వచ్చే సమస్యలు.... 
- అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు  21ఏళ్లు నిండకముందే వివాహం చేయడం వారి ఆరోగ్యానికి అంత క్షేమకరం కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు.  
- ప్రధానంగా స్త్రీలు త్వరగా రక్తహీనతకు గురికావడం,  అనారోగ్య శిశువులు జన్మించడం, అవయవ ఎదుగుదల లేకపోవడం, శిశు మరణాలు ఎక్కువగా జరగడం. 
- త్వరగా గర్భం దాల్చడంవల్ల  వారు త్వరగా బలహీనంగా మారుతారు. పుట్టేబిడ్డ జన్యుపరమైన  సమస్యలతో పాటు, పోషకలోపాలతో జన్మించడం.  
- అధిక సంఖ్యలో గర్భస్రావాలు, మాతాశిశుమరణాలు జరుగుతున్నట్టు వివిధ సర్వేలు చెపుతున్నాయి.  
- దంపతుల మధ్య అవగాహనలోపంతో  కుటుంబంలో కలహాలు వచ్చి త్వరగా విడిపోయే అవకాశం ఉంది.  
- మానసిక పరిపక్వత లేక చిన్న సమస్య తలెత్తినా ఆత్మహత్యలకు ప్రయత్నించడం.  
- కుటుంబహింసకు, లైంగిక హింసకు, ఇంకా పలు సమస్యల బారినపడే అవకాశం.   

అవగాహన కల్పిస్తున్నాం 
బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతీఒక్కరు సహకారించాలి. బాల్య విహాలు చేసుకోవడం నేరం. వివాహాలు చేసిన, చేసేందుకు సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. మంచిర్యాల జిల్లాలో 2014 నుంచి 2018 డిసెంబర్‌ 15 వరకు 48బాల్య వివాహాలను అడ్డుకున్నాం. బాల్యవివాహాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాÆం.  
– రాహూఫ్‌ఖాన్, శిశు సంక్షేమశాఖ అధికారి, మంచిర్యాల 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement