'తప్పు చేయకపోతే మీడియాపై ఆంక్షలెందుకు'
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలు బహిర్గతమవుతాయనే మీడియాపై కేసీఆర్ అంక్షలు విధిస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. తప్పులు చేయకపోతే మీడియా అంటే భయమెందుకని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మీడియా లేకపోతే ప్రజాస్వామ్యమే లేదన్నారు. మీడియాను అణిచివేయాలని చూసిన ఎవ్వరూ మనుగడ సాధించలేదని ఆయన పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల సమయంలోనే తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందుకే ఈనెలాఖరున చేపట్టాల్సిన దీక్షను మార్చి 9న జరుపుతున్నట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలను ఈ సందర్భంగా తూర్పారబట్టారు.