సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలపై డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నామని ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి ఆర్సీ కుంతియా పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్‌కుమార్ యాదవ్ అధ్యక్షతన బుధవారం ఇందిరా భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు బడే భాయ్.. ఛోటా భాయ్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సచివాలయాన్ని కూల్చి వేయాలని చూస్తుంటే .. మోదీ పార్లమెంట్ కూల్చాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అదే విధంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ దేశ ఆర్థిక పరిస్థితిని హృతిక్ రోషన్ సినిమా కలెక్షన్లతో పోల్చడాన్ని కుంతియా తప్పుబట్టారు. ఆర్టీసీ సమ్మెపై కోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం కేసీఆర్ పట్టించుకోక పోవడంపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మెజార్టీ రైతులకు రైతుబంధు డబ్బులు అందలేదన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిజాయితీగా పనిచేసే అధికారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. అదేవిధంగా ఈనెల 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆందోళనలతో పాటు 16న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.
కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌కే పాటిల్ మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, తక్షణమే ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి కంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోదీ ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలను జనంలోకి ఉద్యమ రూపంలో తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కార్యాచరణ రూపొందించిందని చెప్పారు. దేశంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోమాలో.. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు వెంటిలేటర్‌పై ఉందంటూ ఎద్దేవా చేశారు. మోదీ విధానాలు అన్నీ సామాన్యులకు వ్యతిరేకంగా ఉండడంతో.. పారిశ్రామిక వృద్ధి రేటు గణనీయంగా పడిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఆర్‌సీ కుంతియా, హెచ్‌కే పాటిల్, భట్టి విక్రమార్క, జానా రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, బోసు రాజు, దాసోజు శ్రవణ్, బొల్లు కిషన్, కోదండ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment