‘అమ్మ’గా మారిన కానిస్టేబుల్‌  | Women Police Officer Feeds Like A Mother To Unknown Baby Girl In Hyderabad | Sakshi
Sakshi News home page

పోలీసు దంపతుల మానవత్వం 

Published Tue, Jan 1 2019 8:45 AM | Last Updated on Thu, Mar 28 2019 6:19 PM

Women Police Officer Feeds Like A Mother To Unknown Baby Girl In Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: పోలీసు దంపతులు మానవత్వాన్ని చాటుకున్నారు... ఒక గుర్తుతెలియని వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన చిన్నారికి విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌ భార్య (ఆమె కూడా కానిస్టేబుల్‌ )తల్లిపాలిచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వారి బాబుకు ఓ బహుమతిని అందించారు. ఈ ఏడాది చివరి రోజు సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లో ఈ అద్భుత ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనపై సీపీ అంజనీకుమార్‌ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
 
‘మమ’కారం చాటారు.. 
ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఉస్మానియా ఆసుపత్రిలో యాఖత్‌పురా వాసి ఇర్ఫాన్‌ వద్దకు మద్యం మత్తులో ఉన్న ఒక మహిళ వచ్చింది. కొద్దిసేపు పక్కనే నిలబడి.. తాను మంచినీళ్లు తీసుకొస్తానని, రెండు నెలల పాపను ఎత్తుకోమంటూ ఇర్ఫాన్‌కు అందించి కనిపించకుండా పోయింది. పాపను ఇచ్చిన తల్లి తిరిగి వెనక్కి రాకపోవడంతో ఏమి చేయాలో తోయని ఇర్ఫాన్‌ కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి జరిగిన విషయం చెప్పారు. పాపను రాత్రి విధి నిర్వహణలో ఉన్న ఈ–కాప్స్‌ కానిస్టేబుల్‌ రవీందర్‌కు అప్పగించారు. ఆ పాప గుక్కపట్టి ఏడుస్తుంది. తన భార్య ప్రియాంక బేగంపేట్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ప్రసూతి సెలవులపై ఉంది. రవీందర్, తన చేతిలోని పాప విషయాన్ని భార్యకు వివరించాడు. పాప ఏడుపులను ఫోన్‌లో విన్న ప్రియాంక చలించిపోయి, వెంటనే క్యాబ్‌ తీసుకొని అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. వచ్చిన వెంటనే ఆ పాపను హత్తుకొని, తల్లిపాలిచ్చింది. ఆకలితో ఉన్న పాప, తల్లిపాలు తాగిన తరువాత ఏడుపును ఆపి  నిద్రపోయింది.అనంతరం పాపను పేట్లబురుజు ప్రసూతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 
తల్లికి పాప అప్పగింత. .. 
పాపను పోలీస్‌స్టేషన్‌కు తెచ్చిన ఇర్ఫాన్‌ ఇచ్చిన సమాచారంతో సోమవారం ఉదయం వేళల్లో ఎఎస్సై ఎండీ తాహెరుద్దీన్‌ ఆధ్వర్యంలో పాప తల్లి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో చంచల్‌గూడ ప్రాంతంలో ఒక మహిళ ఏడుస్తూ పోలీసుల కంట పడింది. పాప పోయిందంటూ ఆమె ఏడుస్తుండడంతో పోలీసులు ఆరా తీశారు. ఫలక్‌నుమాకు చెందిన షాబాన బేగం చిత్తుకాగితాలు ఏరుకుంటుందని, ఆమె భర్త ఫిరోజ్‌కాన్‌ పాత నేరస్థుడని ఇటీవల సెల్‌ఫోన్‌ దొంగతనం కేసులో అఫ్జల్‌గంజ్‌ పోలీసులు జైలుకు పంపించినట్లు విచారణలో తేలింది. కల్లు తాగేందుకు అలవాటు పడ్డ షాబానకు ఇద్దరు ఆడ పిల్లలకు ఒక పాప ఐదేండ్ల ఫాతిమా కాగా, మరో పాప రెండు నెలల పాప అని పోలీసులు నిర్ధారించారు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి పాపను ఆమెకు అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement