
ఫ్లోరిన్ పీడ విరగడ ఎన్నడో
స్థల వివాదం ముగిసినా మొదలుకాని పనులు
ఊసేలేని తాత్కాలిక కార్యాలయం
రూ.10 కోట్లు మంజూరైనట్లు ప్రకటించిన ఎన్‌ఐఎన్ అధికారులు
అయినా ప్రారంభం కాని పనులు
చౌటుప్పల్ : జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టే విషయంలో పాలకుల్లో చిత్తశుద్ధి కొరవడింది. ఫ్లోరైడ్ నివారణకు చౌటుప్పల్ మండలం మల్కాపురంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఫ్లోరైడ్ పరిశోధనా కే ంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు మన ప్రాంతానికి వచ్చి పరిశోధనలు జరిపి ఫ్లోరైడ్‌ను రూపుమాపేందుకు కృషి చేయనున్నట్లు వెలువడిన ప్రకటనతో జిల్లా ప్రజలు సంతోషించారు. కానీ ఈ పనులు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఈ విషయంలో రెండున్నరేళ్లుగా ఒక్క అడుగు కూడా ముం దుకు పడలేదు. దీంతో జిల్లా ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కేంద్రం నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని ఎన్‌ఐఎన్ అధికారులు ప్రకటించి మూడు నెలలు కావస్తున్నా పరిస్థితిలో మాత్రం మార్పులేదు.
దేశంలోనే అధిక ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా జిల్లాకు పేరుంది. ఫ్లోరైడ్ కారణంగా ఇక్కడి ప్రజలు జీవచ్ఛవాలుగా మారుతున్నారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌రావు 2012 జూలైలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంలో పర్యటించి, బాధితుల కష్టాలను చూసి చలించిపోయారు. ఫ్లోరైడ్‌ను రూపుమాపేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని భావించారు.
ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అప్పటి యూపీఏ ప్రభుత్వం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య శాశ్వత పరిష్కారానికి చౌటుప్పల్ మండలం మల్కాపురంలో జాతీయ ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు నిర్ణయించింది. రూ.250 కోట్ల వ్యయంతో పరిశోధనా కేంద్రాన్ని నిర్మించి, 11 రాష్ట్రాలతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఫ్లోరైడ్ నివారణకు కృషి చేయాలని నిర్ణయించారు. ఫ్లోరోసిస్ బాధితులకు ప్రత్యేక సేవలు అందించడంతో పాటు, వారికి ఏర్పడిన అంగవైకల్యాన్ని అధిగమించేందుకు ప్రత్యేకంగా 75 పడకల ఆస్పత్రిని కూడా నిర్మించాలని నిర్ణియించారు.
ముగిసిన స్థల వివాదం
మల్కాపురం శివారులోని సర్వేనంబర్ 486లో వాహనాల సామర్థ్య కేంద్రానికి, ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. పరిశోధనా కేంద్రానికి 5 ఎకరాలు, వాహనాల సామర్థ్య కేంద్రానికి 10 ఎకరాల చొప్పున కేటాయించారు. దీని సమీపంలోనే క్రషర్ మిల్లులు ఉండడంతో వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో స్థల వివాదం తలెత్తింది. తర్వాత రాష్ట్ర విభజన, ఎన్నికలు రావడంతో ఈ వివాదం మరుగున పడింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చొరవతో స్థల వివాదానికి తెరపడింది. వాహనాల సామర్థ్య కేంద్రానికి 8.16 ఎకరాలు, ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రానికి 8 ఎకరాలు చొప్పున కేటాయించారు. స్థలానికి సంబంధించిన పత్రాలను రెండున్నర నెలల క్రితం జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు జాతీయ పోషకాహార సంస్థ డిప్యూటీ డెరైక్టర్ అర్జున ఎల్.కందారేకు అప్పగించారు.
ప్రారంభం కాని పనులు
జాతీయ ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఇటీవల నాగపూర్‌లో ఫ్లోరైడ్‌పై జరిగిన జాతీయ సదస్సులో కేంద్రం ప్రకటించింది. ఇదే విషయాన్ని జాతీయ పోషకాహార సంస్థ డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ అర్జున్ ఎల్. కందారే ప్రకటించారు. తాత్కాలికంగా చౌటుప్పల్‌లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకొని కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ నేటికీ దీనికి సంబంధించిన పనుల్లో పురోగతి లేదు.
కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం
చౌటుప్పల్‌లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసి పనులు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇంకా అనుమతి రాలేదు. నిధులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పరిశోధనాకేంద్రానికి రాష్ట్రపంచాయతీరాజ్ శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ శాఖ ద్వారానే పనులన్నీ జరుగుతాయి.
- డాక్టర్ అర్జున్ ఎల్.కందారే,
డిప్యూటీ డెరైక్టర్, జాతీయ పోషకాహార సంస్థ
పనులు త్వరలో ప్రారంభం
జాతీయ ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రం పనులు త్వరలో ప్రారంభమవుతాయి. అందుకుతగిన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది. పరిశోధనాకేంద్రానికి 8 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించాం.
- కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మునుగోడు, ఎమ్మెల్యే