
సాక్షి, సిటీబ్యూరో: సిటీ ట్రాఫిక్ చీఫ్‌లకూ జరిమానాలు తప్పట్లేదు. 2011లో నాటి అదనపు సీపీ (ట్రాఫిక్) సీవీ ఆనంద్... తాజాగా గురువారం ట్రాఫిక్ విభాగం ప్రస్తుత బాస్ అనిల్‌కుమార్ ఇద్దరి వాహనాలపై చలాన్లు పడ్డాయి. ఈ రెండు ఉదంతాల్లోనూ అధికారిక డ్రైవర్ల కారణంగానే అధికారులు బుక్ కావడం, రాంగ్ పార్కింగ్‌కు సంబంధించిన చలాన్లు కావడం కొసమెరుపు. రికార్డుల ప్రకారం ఆయా డ్రైవర్లే జరిమానా కట్టినట్లు ఉన్నా... ఆనక ఆ డబ్బును ట్రాఫిక్ చీఫ్‌లు తమ జేబుల్లోంచి ఇచ్చారు. ఇద్దరూ అధికారిక వాహనాల్లో, అఫీషియల్ విధుల్లో ఉన్నప్పుడే ఇలా జరగడం యాదృచ్ఛికం.
పంజగుట్టలో సీవీ ఆనంద్...
సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత సీఐఎస్‌ఎఫ్ ఐజీ సీవీ ఆనంద్ గతంలో నగర ట్రాఫిక్ చీఫ్‌గా పని చేశారు. అప్పట్లో ఆయన నిబంధనలు ఉల్లంఘిస్తున్న పోలీసు వాహనాలపై స్పెషల్‌డ్రైవ్ చేపట్టారు. ఇది ప్రారంభించిన రెండో రోజే ఆనంద్ వాహనానికి జరిమానా పడింది. పోలీసు వాహనాలపై స్పెషల్‌డ్రైవ్‌ను పర్యవేక్షించడానికి సీవీ ఆనంద్ 2011 ఆగస్టు 11 మధ్యాహ్నం 1.00 గంటల ప్రాంతంలో సోమాజిగూడలోని రాజీవ్‌గాంధీ చౌరస్తా వద్దకు వెళ్లారు. తన స్కార్పియో వాహనాన్ని (ఏపీ 9 పీఏ 0360) దిగి జంక్షన్‌లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది వద్దకు చేరుకున్నారు. దీంతో డ్రైవర్ వాహనాన్ని ఆ సమీపంలోని నో పార్కింగ్ ఏరియాలో ఆపారు. తన పని ముగించుకుని తిగిరి వచ్చిన ఆనంద్ ఈ విషయాన్ని గుర్తించారు. అక్కడే ఉన్న అప్పటి పంజగుట్ట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చంద్రకుమార్‌ను పిలిచి తన డ్రైవర్‌కూ రాంగ్ పార్కింగ్ నేరం కింద రూ.200 జరిమానా విధించమని ఆదేశించారు. ఆ ప్రకారం రాసిన చలానా మొత్తాన్ని మాత్రం ఆనంద్ చెల్లించి డ్రైవర్‌ను హెచ్చరించారు.
మహంకాళిలో అనిల్‌కుమార్...
ఆనంద్ తర్వాత దాదాపు ఏడేళ్లకు నగర ట్రాఫిక్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న అనిల్‌కుమార్ ‘వంతు’ వచ్చింది. ప్రస్తుతం ట్రాఫిక్ చీఫ్‌గా ఉన్న అనిల్‌కుమార్ గడిచిన కొన్ని రోజులుగా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. వీటిలో భాగంగా వివిధ ట్రాఫిక్ ఠాణాలతో పాటు ఏసీపీ కార్యాలయాలకూ వెళ్తున్నారు. గురువారం నార్త్‌జోన్ పరిధిలో ఉన్న మహంకాళి ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌కు అనిల్‌కుమార్ వెళ్ళారు. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్ సమీపంలోని భవనం మొదటి అంతస్తులో ఉన్న ఈ ఠాణాకు అనిల్‌కుమార్ తన వాహనం దిగి లోపలకు వెళ్లిపోయారు. వాహనాలను సక్రమంగా నిలపాల్సిన బాధ్యత ఆ వాహ నం డ్రైవర్‌దే. అనిల్‌కుమార్‌కు డ్రైవర్‌గా వ్యవహరించిన సిబ్బంది దాన్ని రోడ్డు పక్కగా ఆపారు. అదే ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసి న నో–పార్కింగ్ బోర్డు ఉంది. ఇలా రాంగ్ పా ర్కింగ్‌లో ఉన్న వాహనం, దానికి పోలీసుల అధికారులకు చెందినది అని చెప్పే ఆనవాళ్లు ఉండ టం గమనించిన ఓ నెట్‌జనుడు ఫొటో తీశాడు. దీన్ని మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నగర ట్రాఫిక్ పోలీసు అధికారిక ట్విటర్ ఖాతాకు ట్వీట్ చేశాడు. తక్షణం స్పందించిన అధికారులు అదనపు సీపీ వాహనంపై రూ.235 జరిమానా విధి స్తూ ఈ–చలాన్ జారీ చేశారు. విషయం తెలుసుకు న్న అనిల్‌కుమార్ ఆరా తీయగా డ్రైవర్ చూపిన నిర్లక్ష్యం బయటపడింది. దీంతో తొలుత అతడితో రూ.235 జరిమానా కట్టించి ఈ–చలాన్ క్లోజ్ చే యించారు. ఆపై కొద్దిసేపటికి ట్రాఫిక్ చీఫ్ సదరు డ్రైవర్‌కు తన జేబు నుంచి ఆ మొత్తం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment