ప్రాదేశిక పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల ప్రచారం జోరందుకుంది. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న వైఎస్సార్ సీపీ శ్రేణుల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
యాచారం, న్యూస్‌లైన్: ప్రాదేశిక పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల ప్రచారం జోరందుకుంది. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న వైఎస్సార్ సీపీ శ్రేణుల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సంక్షేమ పథకాలతో తమ ఇళ్లల్లో వెలుగులు నింపిన మహానేత వైఎస్ ఆశయాల కోసం ఫ్యాను గుర్తుకు ఓటేసి కృతజ్ఞత తెలుపుకుంటామని ప్రజలు హామీ ఇస్తున్నారు.
శనివారం మండల పరిధిలోని నందివనపర్తి, అయ్యావారిగూడెం తదితర గ్రామాల్లో పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్, మండల జెడ్పీటీసీ అభ్యర్థి అమృతాసాగర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ రెండు గ్రామాల్లోనూ ప్రచారానికి మహిళల నుంచి భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా అమృతాసాగర్ మాట్లాడుతూ.. తనను మండల జెడ్పీటీసీగా గెలిపిస్తే మండలంలోని 20 గ్రామాల్లో రూ. 40 లక్షలు ఖర్చు చేసి నీటిశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తానని అన్నారు.
అదే విధంగా మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. వైఎస్ హయాం నాటి స్వర్ణయుగం మళ్లీ రావాలంటే వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కూడా వైఎస్సార్‌సీపీకి అపూర్వ స్పందన రావడం సంతోషం కలిగిస్తుందని చెప్పారు. అలాగే శుక్రవారం రాత్రి కూడా అమృతాసాగర్ నల్లవెల్లి, చింతపట్ల తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అమృతాసాగర్ సమక్షంలో పెద్ద సంఖ్యలో పలు పార్టీల కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కేసరిసాగర్, జోసఫ్, జయరాజ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
మల్కీజ్‌గూడలో ఇంటింటి ప్రచారం
మండల పరిధిలోని మల్కీజ్‌గూడలో మండల ప్రాదేశిక సభ్యురాలు రామావత్ మల్లమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో జెడ్పీటీసీగా పని చేసిన తాను చేపట్టిన అభివృద్ధిని గమనించి మళ్లీ ఓటువేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈసారి ఎంపీటీసీగా గెలిపిస్తే మల్కీజ్‌గూడను అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ మోతిరాం నాయక్, గ్రామ మాజీ సర్పంచ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.