గూడ్స్‌ను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ | 14 killed in train accident in UP, toll may go up to 40 | Sakshi
Sakshi News home page

గూడ్స్‌ను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్

Published Tue, May 27 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM

14 killed in train accident in UP, toll may go up to 40

* 40 మంది వరకూ మృతి  
* వంద మందికి పైగా గాయాలు
* ఉత్తరప్రదేశ్‌లోని చౌరేబ్ రైల్వేస్టేషన్ సమీపంలో ప్రమాదం
 
సంత్‌కబీర్‌నగర్ (యూపీ): సమయం.. సుమారు ఉదయం 10 గంటలు.. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు వెళుతున్న రైలు చౌరేబ్ స్టేషన్‌కు చేరుకుంటోంది.. వరుసగా ఉన్న నాలుగు జనరల్ బోగీల్లో ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నారు.. ఆ వెనకాలే ఉన్న రెండు ఏసీ బోగీల్లో ఉన్నవారు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు.. ఇంతలో ఒక్కసారిగా పెద్ద చప్పుడు.. కుదుపులు.. ఒకదానిలోకి ఒకటి దూసుకెళ్లిన బోగీలు... అక్కడికక్కడే మృతి చెందినవారు కొందరు.. తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్నవారు మరికొందరు.. వారి బంధువులు.. హాహాకారాలు, సహాయం కోసం ఆర్తనాదాలు... సోమవారం జరిగిన గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటన దృశ్యాలివి...
 
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదంలో 40 మంది మరణించినట్లు వార్తలు వస్తుండగా... అధికారులు మాత్రం 14 మంది మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ ప్రమాదంలో సుమారు వంద మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బోగీల్లోనే చిక్కుకున్నారు.
 
ఢిల్లీ నుంచి గోరఖ్‌పూర్‌కు వస్తున్న ఈ గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ రైలు సంత్‌కబీర్‌నగర్ జిల్లా చౌరేబ్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎక్స్‌ప్రెస్‌రైలు ఆరు బోగీలు గూడ్స్ రైలు బోగీల్లోకి దూసుకెళ్లడంతో భారీ ప్రమాదం జరిగింది. ఇందులో నాలుగు జనరల్ బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా మంది ప్రయాణికులు బోగీల్లోనే చిక్కుకుపోయారు. వారిని బయటికి తీసేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

జనరల్ బోగీలు బాగా ధ్వంసం కావడంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ, గోరఖ్‌పూర్‌లలో అత్యవసర సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశామని రైల్వే బోర్డు చైర్మన్ అరుణేంద్రకుమార్ చెప్పారు. ఈ ఘటనపై రైల్వే భద్రత ఈశాన్య విభాగం కమిషనర్ పీకే వాజ్‌పేయితో విచారణ జరిపిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ రైలు ప్రమాదంతో ఢిల్లీ-గోరఖ్‌పూర్ మధ్య నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు.
 
రూ. లక్ష చొప్పున పరిహారం..
ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ. లక్ష చొప్పున, తీవ్రంగా గాయపడినవారికి రూ. 50 వేలు, స్వల్పంగా గాయపడినవారికి రూ. 10 వేలు పరిహారంగా ఇస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్య సహాయాన్ని అందిస్తామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.
 
రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ దిగ్భ్రాంతి..
గోరఖ్‌దామ్ రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తాజామాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. దుర్ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, క్షతగాత్రులకు సహాయం అందించాలంటూ కేబినెట్ సెక్రటరీని ఆదేశించినట్లు మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement