
30లక్షల డెబిట్ కార్డుల సమాచారం లీక్?
ముంబై: దేశంలోని డెబిట్ కార్డుల వివరాలు పెద్దమొత్తంలో అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోవడాన్ని అతిపెద్ద ఆర్థిక డేటాల ఉల్లంఘనగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దాదాపు 30 లక్షలకు పైగా (3.2 మిలియన్ ) కార్డుల డాటా తస్కరించబడిందని సమాచారం. వీటిల్లో సుమారు 20 లక్షలకు పైగా (2.6 మిలియన్ల) వీసా, మాస్టర్ కార్డులు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని గుర్తించడానికి సుమారు ఆరు వారాల పట్టిందనీ ఈ సమయంలో హిటాచీ నెట్వర్క్ లో ఉపయోగించిన సుమారు 3.2 మిలియన్ల కార్డుల సమాచారాన్ని హ్యాకర్లు సేకరించారని చెబుతున్నారు. ముఖ్యంగా చైనాలోని వివిధ ఏటీఎం సెంటర్లలో, విక్రయ కేంద్రాల్లో అనధికారిక లావేదేవీలు, కొనుగోలు జరిగినట్టుగా బాధితులు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై విచారణకు ఆదేశించినట్టు నేషనల్ పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ)ఎండీ ఏపీ హోతా తెలిపారు. బ్యాంకులనుంచి తమకు ఫిర్యాదులు అందాయనీ, ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఎక్కడ జరిగింది అనేది విచారిస్తున్నామని తెలిపారు.
బ్యాంకులు, డెబిట్ కార్డుల సమాచారం భారీ ఎత్తున లీక్ అయిందనే అంచనాలతో దాదాపు అన్ని బ్యాంకులు ఏటీఎం పిన్ నంబర్ ను మార్చుకోవాలని సూచిస్తున్నాయి. పిన్ లేకుండా జరిగే అంతర్జాతీయ లావాదేవీలనన్నింటినీ నిలిపివేశాయి ఇప్పటికే ఆరున్నర లక్షల డెబిట్ కార్డులను బ్లాక్ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీరందరికీ కొత్త కార్డులను ఇవ్వనున్నట్టు తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగానే సుమారు 6 లక్షలకు పైగా కార్డులను బ్లాక్ చేశామని తమ ఏటీఎంలో ఎలాంటి అక్రమాలు జరగడంలేదని ఖాతాదారులకు భరోసా ఇచ్చినట్టు బ్యాంకు సమాచార అధికారి మృత్యుంజయ్ మహాపా త్ర తెలిపారు. ఈ వ్యవహారంలో సుమారు రెండు వారాల క్రితమే చర్యలు తీసుకున్నామని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ తెలిపింది. పిన్ లు మార్చుకోమని సలహా ఇవ్వడంతోపాటు, ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడొద్దని కోరినట్టు బ్యాంక్ ప్రతినిధి వెల్లడించారు. వీసా, మాస్టర్ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్, ఎస్ బ్యాంకులనుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.