చిత్తూరు : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం కాట్పేరి వద్ద శనివారం రాయలసీమ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి చిన్నారి విద్యార్థులను బస్సులో నుంచి బయటకు తీశారు. అనంతరం వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా... మరికొంతమందిని మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అయితే ఐదారుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. బస్సును రహదారిపై నుంచి పక్కకు తొలగించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నారని పోలీసులు తెలిపారు. రహదారిపై ఎదురుగా వస్తున్న స్కూటర్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు.