చెక్ పోస్టులపై ఏసీబీ పంజా | ACB to ride on Check posts | Sakshi
Sakshi News home page

చెక్ పోస్టులపై ఏసీబీ పంజా

Published Wed, Sep 9 2015 2:14 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

చెక్ పోస్టులపై ఏసీబీ పంజా - Sakshi

చెక్ పోస్టులపై ఏసీబీ పంజా

* ఒకేరోజు ఎనిమిది ఆర్‌టీఏ చెక్‌పోస్టులపై దాడి...
* లెక్కచూపని లక్షలాది రూపాయలు సీజ్
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించే వాహనాలను సరిహద్దుల వద్దే తనిఖీలు చేసి, నిరోధించాల్సిన ఆర్టీఏ (రోడ్డు ట్రాన్స్‌పోర్టు అథారిటీ) అధికారుల అవినీతి బాగోతం బట్టబయలైంది. చెక్‌పోస్టులను అడ్డాగా చేసుకొని చెలరేగిపోతున్న వ్యవహారం అవినీతి నిరోధక శాఖ దాడుల్లో వెలుగుచూసింది. లక్షలాది రూపాయల ‘అక్రమ’సొమ్మును స్వాధీనం చేసుకుంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది సరిహద్దు చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు.
 
 మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్ చెక్‌పోస్టు వద్ద లెక్కలోకి రాని రూ.84 వేలు లభించాయి. నల్లగొండ జిల్లా కోదాడలో రూ.30 వేలు, ఖమ్మం జిల్లా అశ్వారావుపేట చెక్‌పోస్టు వద్ద రూ.7 వేలు, ముత్తగూడెం వద్ద రూ.15 వేలు పట్టుబడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి వద్ద రూ.58 వేలు, బోరాస్ చెక్‌పోస్టు వద్ద రూ.45 వేలు, నిజామాబాద్ జిల్లా మగ్నూర్ వద్ద రూ.44 వేలు, మెదక్ జిల్లా జహీరాబాద్ వద్ద రూ.52వేలు లెక్కలోకి తేలని సొమ్ము దొరికింది.
 
 ఖజానాకు భారీగా గండి!
 రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ముఖ్యశాఖల్లో ఆర్టీఏ (రోడ్డు ట్రాన్స్‌పోర్టు అథారిటీ) కూడా ఒకటి. వాహనాల రిజిస్ట్రేషన్‌లతో పాటు రహదారి చెక్‌పోస్టుల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే సరుకులకు విభాగాల వారీగా ప్రభుత్వం పన్నులు విధిస్తోంది. కానీ మామూళ్లకు అలవాటు పడిన కొందరు అధికారులు పన్ను ఎగవేతదారులను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్, పర్మిట్, ఓవర్‌లోడ్ చెకింగ్ చేయకుండానే లంచాలు తీసుకుని వదిలేస్తున్నారు. దీంతో కోట్ల విలువ చేసే వస్తువులు అక్రమ మార్గంలో రాష్ట్రంలోకి ప్రవేశించి నల్లబజారుకు చేరుతున్నాయి. ఇలాంటి అధికారులు, సిబ్బంది సహకారంతో బడా వ్యాపారవేత్తలు ప్రభుత్వం కళ్లుగప్పి యథేచ్చగా జీరో దందా చేస్తూ పన్నులు ఎగ్గొడుతున్నారు. ఇలా రాష్ట్రంలోకి గ్రానైట్, మార్బుల్స్, ఎలక్ట్రికల్ పరికరాలు వంటివి పన్నులు చెల్లించకుండా వచ్చేస్తున్నట్లు ఇటీవల వాణిజ్యపన్నుల శాఖ సమీక్ష సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ఈ శాఖలో ప్రభుత్వం నిర్దేశించుకున్న పన్నుల లక్ష్యం తగ్గిపోతోంది.
 
 అంతా ప్రైవేట్ సైన్యమే!
 రాష్ట్రంలో పన్నుల ఆదాయం భారీగా తగ్గడంతో వాస్తవాలను తేల్చేందుకు ప్రభుత్వం ఇటీవల కొన్ని ప్రత్యేక బృందాలను నియమించింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న సరుకులు, సరిహద్దుల్లోని చెక్‌పోస్టులపై అధ్యయనం చేసింది. దీంతో ఆర్టీఏ చెక్‌పోస్టుల వద్ద జరుగుతున్న తతంగం బయటపడింది. ఆర్టీఏ చెక్‌పోస్టుల వద్ద ఎంవీఐ (మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్) ఒకరు ఇన్‌చార్జిగా పూర్తిబాధ్యత నిర్వర్తిస్తారు. వీరి కింద ముగ్గురు ఏఎంవీఐలు మూడు షిప్టుల్లో ఉండాలి. కానీ అధికారుల అవగాహనతో రోజంతా ఒక్కరే ఉంటున్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది సైతం యూనిఫామ్‌ను ధరించరు. అసలు ఏఎంవీఐలు ప్రైవేట్ సిబ్బందిని నియమించుకొని దర్జాగా వసూళ్లకు పాల్పడుతున్నారు. వారు సైతం ప్రతీ గంటకు ఒకరి చొప్పున మారుతూ డబ్బులను తరలిస్తుంటారు.
 
 ఫిర్యాదులు ఎన్నో..
 అవినీతిని నిరోధించడం కోసం సీఎం కేసీఆర్ ఈ ఏడాది జనవరి 11న ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రకటించారు. దాదాపు ఎనిమిది నెలల కాలంలో దీనికి ఆర్టీఏ శాఖపై 106 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై ఏసీబీ పక్కా సమాచారాన్ని సేకరించి, దాడులు చేస్తోంది. ఇంతకుముందు ఒకేసారి ఆరు చెక్‌పోస్టులపై దాడి చేయగా... మంగళవారం ఒకేసారి ఎనిమిది చోట్ల దాడులు చేసి, లెక్కలోకి రాని లక్షలాది రూపాయలను గుర్తించింది. గతంలో మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ చెక్‌పోస్టుపై రెండు సార్లు దాడులు చేయగా రూ.లక్షకు పైగా పట్టుబడింది. తాజా దాడిలోనూ అత్యధికంగా రూ. 84 వేలు పట్టుబడటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement