మంగళగిరి ఎయిమ్స్ మూడేళ్లలో పూర్తి
శంకుస్థాపన సభలో కేంద్రమంత్రి నడ్డా వెల్లడి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో వైద్య రంగాన్ని అభివృద్ధి పరిచి, పేదలకు ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మెరుగైన వైద్య సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. దేశంలో 10 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో శనివారం ఎయిమ్స్ శంకుస్థాపన కార్యక్రమానికి జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. మంగళగిరి ఎయిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్య సౌకర్యాలతోపాటు ఆయుర్వేదం, యునానీ, సిద్ధ వంటి అదనపు సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ ఎయిమ్స్ నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
హరియాణా, కోల్‌కతాలో రెండు కేన్సర్ పరిశోధనా కేంద్రాలు, అన్ని రాష్ట్రాల్లో 20 కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లు, 50 క్యాన్సర్ ప్రత్యేక ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. దేశంలో 58 జిల్లా ఆసుపత్రుల స్థాయిని పెంచి వైద్య కళాశాలలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మెడికల్ హబ్‌గా ఏపీ: చంద్రబాబు
వైద్య రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరి ఎయిమ్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఎయిమ్స్‌ను దేశంలో నంబర్‌వన్‌గా రూపొందిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఎయిమ్స్ విద్యార్థులకు విజయవాడ లేదా గుంటూరు ఆసుపత్రుల్లో తరగతులు ప్రారంభించాలని యోచిస్తున్నామన్నారు. రాజధానికి ఎయిమ్స్ ను మణిహారంగా మారుస్తామన్నారు. ఆసుపత్రుల్లో జనరిక్ మందుల అమ్మకాలను డ్వాక్రా గ్రూపులకు అప్పగిస్తామన్నారు. గుంటూరు, కర్నూలులో కేన్సర్ ఆసుపత్రుల ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు.
ఎయిమ్స్‌కు రూ.4 కోట్ల విరాళాలు
మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణానికి ప్రవాసాంధ్ర కుటుంబాలకు చెందిన డాక్టర్ సదాశివరావు కుమారులు రమేశ్, సురేశ్ రూ.2 కోట్లు, డాక్టర్ చిగురుపాటి నాగేశ్వరరావు కుమారుడు కృష్ణప్రసాద్ రూ.2 కోట్లు విరాళంగా అందచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని సన్మానించారు. వైద్యరంగంలో విశేష సేవలు అందిస్తున్న వైద్య ప్రముఖులు సోమరాజు, గురువారెడ్డి, మన్నెం గోపీచంద్, చదలవాడ నాగేశ్వరరావు, ముక్కామల అప్పారావులను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పి.అశోక్‌గజపతిరాజు, వై.సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు, పి.మాణిక్యాలరావు, ఎంపీలు గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, మాగంటి బాబు తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ-గుంటూరుకు ఎలక్ట్రికల్ ట్రైన్
ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను దేశంలోని 393 జిల్లాల్లో 30 కోట్ల మందికి వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఎయిమ్స్ శంకుస్థాపన సభలో ఆయన ప్రసంగించారు. విజయవాడ-గుంటూరు మధ్య ఎలక్ట్రికల్ ట్రైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా అంతర్వేది వద్ద రూ.1,800 కోట్లతో డ్రెడ్జింగ్ పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.