
రెండురోజుల్లో 10వేలకు పైగా ఖాతాలు
ముంబై: టెలికాం రంగంలో రారాజులా వెలుగొందుతున్న భారతి ఎయిర్ టెల్ మరో ఘనతను సాధించింది. మొట్టమొదటి పే మెంట్ బ్యాంకును ఇటీవల ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఎయిర్ టెల్ పే మెంట్ బ్యాంకు రికార్డు స్థాయి ఖాతాలతో దూసుకుపోతోంది. పైలట్ ప్రాజెక్ట్ తో రాజస్థాన్ లో ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్ తో కేవలం రెండు రోజుల్లోనే ఎయిర్టెల్ చెల్లింపుల బ్యాంక్ 10,000 పైగా పొదుపు ఖాతాలను నమోదు చేసింది. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలకు గణనీయమైన వృద్ధి ఉన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ అకౌంట్లు తెరిచినట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది.
సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీతో ఇటీవల ప్రయోగాత్మంగా ఎయిర్టెల్ చెల్లింపులు బ్యాంక్ ను ప్రారంభించింది. దేశంలో పొదుపు ఖాతాలపై అధిక వడ్డీని చెల్లించడంతో పాటు లక్ష రూపాయల వ్యక్తిగత బీమాను కూడా అందిస్తున్నామని ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ ఎండీ, సీఈవో శశి అరోరా తెలిపారు. రాబోయే రోజుల్లో ఖాతాదారులకు మరిన్ని ప్రయోజనాలను అందించనున్నట్టు చెప్పారు. మరోవైపు ఆర్బీఐ ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకులో వ్యక్తిగత ఖాతాదారుల గరిష్ట పరిమితిని లక్ష రూపాయలుగా నిర్ణయించింది.