గంగపై ఒట్టేసి నిజం చెప్పండి మోదీ
గంగపై ఒట్టేసి నిజం చెప్పండి మోదీ
Published Mon, Feb 20 2017 1:28 PM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
రాయబరేలి: తీవ్రమైన విద్యుత్ కొరతతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంధకారంలో ఉంటుందంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన విమర్శనలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తిప్పికొట్టారు. తమ ప్రభుత్వం 24 గంటలు వారణాసికి విద్యుత్ అందిస్తుందని తెలిపారు. రాయబరేలిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్, ఇది సమాజ్ వాద్ పార్టీ, కచ్చితంగా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తుంది అంటూ మోదీ విమర్శలను ఖండించారు. ''ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజాలు మాట్లాడాలి. వాస్తవాన్ని అంగీకరించాలి, ఇది ఎస్పీ గవర్నమెంట్, మర్చిపోకుండా మీ నియోజకవర్గానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాం'' అని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.
'' మీరు గంగను తల్లిగా ఆరాధిస్తారు. ఎస్పీ ప్రభుత్వం 24 గంటలు వారణాసికి విద్యుత్ సరఫరా చేస్తుందో లేదో మీరు ఎంతో భక్తిగా ఆరాధించే గంగపై ఒట్టువేసి నిజం చెప్పండి'' అని సవాల్ విసిరారు. ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ విద్యుత్ కొరతను ఎదుర్కొంటుందని ప్రధాని నరేంద్రమోదీ ఎస్పీ ప్రభుత్వాన్ని విమర్శించిన సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసే విషయంలో అఖిలేష్ ప్రభుత్వం పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తుందని మోదీ పేర్కొన్నారు.
Advertisement