
దాసరి అంతిమయాత్ర: ఫ్యాన్స్ కేకలపై బన్నీ ఆగ్రహం
హైదరాబాద్: సమయం, సందర్భం పట్టించుకోకుండా ఇటీవల ప్రతిచోటా ఆయా హీరోల ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తాజాగా దాసరి నారాయణరావు అంతిమయాత్రలోనూ అభిమానులు ఇదేవిధంగా శృతిమించి ప్రవర్తించారు. దివికేగిన దర్శకరత్న దాసరి నారాయణరావుకు నివాళులర్పించేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వచ్చాడు.
దాసరి భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం బన్నీ వెళ్తుండగా అతని అభిమానులు శృతిమించి ప్రవర్తించారు. విషాద సందర్భంలోనూ డీజే, డీజే అంటూ కేకలు పెట్టారు. దీంతో చిర్రెత్తిపోయిన బన్నీ అభిమానులవైపు చాలా ఆగ్రహంగా చూశాడు. కేకలు వేయొద్దంటూ వారికి వేలెత్తి చూపించారు. అభిమానులు పెద్దసంఖ్యలో బన్నీ చుట్టుముట్టడంతో వారి నుంచి తప్పించి.. తిరిగి ఆయనను వాహనంలోకి చేర్చడం బౌన్సర్లకు కొంచెం కష్టసాధ్యంగా మారింది.